టిఆర్ఎస్‌, బిజెపి రెండూ ఆహ్వానించాయి: ఎల్ రమణ

June 14, 2021


img

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ త్వరలో టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈరోజు జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి, టిఆర్ఎస్‌ రెండు పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందినమాట వాస్తవం. కానీ నేను ఏ పార్టీలోను చేరుతానని చెప్పలేదు. కానీ టిఆర్ఎస్‌ ఆహ్వానంపై పార్టీలో నా అనుచరులతో చర్చిస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకొంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. పదవులు, అధికారం కోసం నేను ప్రాకులాడుతున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను. అవి నాకు ముఖ్యం కాదు. వాటి కోసం ఏనాడూ నేను పాకులాడలేదు. టిడిపి అధికారంలో ఉన్నపుడు మంత్రి పదవి లభించింది. టిడిపి ద్వారానే నాకు ఇంత గుర్తింపు, గౌరవం లభించాయి. కనుక తెలంగాణ రాష్ట్రంలో టిడిపిని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నాను,” అని అన్నారు.  

అధికార టిఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం కోసం రాష్ట్రంలో మోత్కుపల్లి నర్సింహులు వంటివారు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఎవరికీ అవకాశం, ఆహ్వానం రాలేదు...ఎల్ రమణకు మాత్రమే వచ్చింది. ఇది కాదనలేని ఆఫర్ అని అందరికీ తెలుసు. కనుకనే ఎల్ రమణ గత రెండుమూడు రోజులుగా తన అనుచరులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో టిడిపి కనుమరుగైనందున ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఎల్ రమణకు అనుచరులు చెప్పినట్లు తెలుస్తోంది. పైగా ప్రస్తుతం టిఆర్ఎస్‌లో ఉన్నవారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరి వంటి చాలామంది టిడిపి నుంచి వెళ్ళినవారే ఉన్నారు కనుక ఎల్ రమణ టిఆర్ఎస్‌లో సులువుగానే ఇమిగిపోగలరు. కనుక ఆయన టిఆర్ఎస్‌ చేరడం ఖాయమనే భావించవచ్చు.


Related Post