వారం రోజులు గడువు..తరువాత చర్యలే: సిఎం కేసీఆర్‌

June 14, 2021


img

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలు, వివిద శాఖల  ఉన్నతాధికారులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతీ పట్టణం పల్లె కూడా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ రెండు కార్యక్రమాలు ప్రారంభించుకొన్నాము. కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనులు జరుగడం లేదని పిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలలో, 21న వరంగల్‌ జిల్లాలో పర్యటించి స్వయంగా పరిశీలిస్తాను. నా పర్యటనకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. కనుక ఇప్పటికైనా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకోండి లేకుంటే బాధ్యులపై కటిన చర్యలు తప్పవు. గ్రామసభలు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తున్న గ్రామ కార్యదర్శులు, సర్పంచులపై చర్యలు ఉంటాయి. ఇంతకాలం అందరికీ మెత్తగా, మృదువుగానే చెప్పాము కానీ తీరు మారకుంటే టిఆర్ఎస్‌కు చెందిన వారైనా కటిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోను. స్థానిక సంస్థల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ జిల్లా అదనపు కలెక్టరుకు రూ.25 లక్షల చొప్పున తక్షణమే నిధులు అందజేస్తాము. కనుక ఈ వారం రోజులలోగా అన్ని సమస్యలను పరిష్కరించాలి. 

సమీకృత మార్కెట్లు, వైకుంఠదామాలు, పబ్లిక్ టాయిలెట్లు, నర్సరీలు, హరితహారం కార్యక్రమం అమలవుతున్న తీరుపై జిల్లాలవారీగా నివేదికలు పంపించాలి. పట్టణాలు, గ్రామాలలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్స్, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్స్, ట్రాన్స్‌ఫార్మార్స్, నీళ్ళ ట్యాంకులు వంటి ప్రజావసరాలకు నిర్మిస్తున్నవాటిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా స్థానిక మునిసిపాలిటీల పేరిట ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించాలి. ప్రతీ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ రికార్డులు నిర్వహిస్తుండాలి. నేను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకొని దానిలో పట్టణాలను, పల్లెలను జిల్లా కలెక్టర్ సహాయసహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తాను,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post