ఆనాడు మోడీని గద్దెనెక్కించిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు...

June 12, 2021


img

2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్రమోడీ తరపున పనిచేసి బిజెపికి ఘనవిజయం సాధించి పెట్టిన ఘనుడు ప్రశాంత్ కిషోర్. అప్పటి నుంచే దేశంలో ఆయన పేరు మారుమ్రోగిపోవడం మొదలైంది. ఆ తరువాత అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలకు పనిచేసి చాలా వాటికి విజయాలను అందించారు. ఆ క్రమంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయనకు బిజెపి పెద్దలకు మద్య దూరం పెరిగింది. ప్రశాంత్ కిషోర్‌కు కూడా బిజెపి రాజకీయ విధానాల పట్ల, ప్రధాని నరేంద్రమోడీ పాలన పట్ల విముఖత ఏర్పడింది. అందుకే పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో మమతా బెనర్జీతో, తమిళనాడు ఎన్నికలలో డీఎంకె అధినేత స్టాలిన్‌తో చేతులు కలిపి బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకొన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మరింత పెద్ద లక్ష్యం పెట్టుకొని పావులు కదుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించాలనుకొంటున్నారని, ఆ ప్రయత్నాలలోనే దేశంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను వరుసగా కలుస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీతో పోటీ పడలేకపోతున్నారు కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బలమైన ప్రత్యర్ధిని ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ కిషోర్‌ ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ ప్రయత్నాలలోనే మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి నిన్న సుమారు మూడు గంటలసేపు చర్చించారు. ప్రశాంత్ కిషోర్‌ త్వరలో సిఎం కేసీఆర్‌ను కూడా ఆయన కలుస్తారని సమాచారం. సిఎం కేసీఆర్‌ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు కానీ సఫలం కాలేదు. కనుక అన్ని పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిఎం కేసీఆర్‌ ఇష్టపడతారా లేక తన నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని కోరుతారా?అనేది మున్ముందు తెలుస్తుంది. సిఎం కేసీఆర్‌ ఎప్పటి నుంచో జాతీయరాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నారు కనుక ప్రశాంత్ కిషోర్‌ ఏదైనా మంచి ప్రతిపాదనతో వస్తే అంగీకరిస్తారేమో? 


Related Post