టిఆర్ఎస్‌లో చేరడం లేదు... కానీ ఉపఎన్నికలో పోటీ చేస్తా!

June 12, 2021


img

ఇటీవల ఓ పెళ్ళి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత కౌశిక్ రెడ్డితో వేరుగా మాట్లాడటంతో ఆయనకు టిఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం అందిందని, ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ, “మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌ కలిస్తే మర్యాదపూర్వకంగా పలకరించడం తప్పు కాదు. కానీ అంత మాత్రాన్న టిఆర్ఎస్‌లో చేరిపోతానని ప్రచారం చేయడం సరికాదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. అవకాశం ఇస్తే మళ్ళీ ఈటల రాజేందర్‌పై పోటీ చేస్తాను. ఈసారి కూడా తప్పకుండా నాకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.     

టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి బందువు అవుతారు. ఆయన టిఆర్ఎస్‌లో చేరితే ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితి తలెత్తకుండా మళ్ళీ కౌశిక్ రెడ్డికే టికెట్ కేటాయించే అవకాశం ఉంది. కానీ టిఆర్ఎస్‌ ఒత్తిళ్ళును తట్టుకోవడం, కాదనలేని ఆఫర్స్ వదులుకోవడం రెండూ కష్టమే. కనుక ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించేలోగా ఏమైనా జరుగవచ్చు. 


Related Post