హుజూరాబాద్‌ ఉపఎన్నికలో అభ్యర్డులు ఎవరు?

June 12, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగనుంది. అప్పుడే టిఆర్ఎస్‌, ఈటల రాజేందర్‌ దానిపై ఆలోచనలు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై ప్రస్తుతం కాస్త తికమకగా ఉంది.

ఆ నియోజకవర్గం ఈటలకు కంచుకోట వంటిది దానికి ఇంతకాలం ప్రాతినిధ్యం వహించారు కనుక మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని భావించడం సహజం. కానీ ఈ ఉపఎన్నికలో ఆయనను ఓడించేందుకు టిఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది కనుక ఒకవేళ ఓడిపోతే ఈటలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక తన భార్య జమునను నిలబెడదామా?అని ఈటల ఆలోచిస్తున్నట్లు అప్పుడే మీడియాలో వార్తలు వచ్చాయి. స్వయంగా నిలబడి ఓడిపోతే జరిగే నష్టం కంటే వేరెవరో ఒకరిని నిలబెట్టి అతను లేదా ఆమె ఓడిపోతే జరిగే నష్టం తక్కువ. కనుక ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకొని తన సత్తా చాటుకోవడం మేలని ఈటల రాజేందర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ధాటికి డిపాజిట్ కోల్పోయిన బిజెపి, ఈటల వంటి బలమైన నాయకుడి సాయంతో హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ను ఓడగొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కనుక ఈటల పోటీ చేస్తారా?ఆయన భార్య జమున లేదా మరెవరైనా పోటీ చేస్తారా?అనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

ఈటలకు ఈ ఉపఎన్నికలో గెలవడం చాలా అవసరం కనుక ఆయన కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతారని టిఆర్ఎస్‌కు బాగా తెలుసు. పైగా ఆ నియోజకవర్గ ప్రజలలో ఈటల పట్ల సానుభూతి కూడా ఉంది. కనుక ఈటలను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్ధి కోసం టిఆర్ఎస్‌ వెతుకుతోంది. ప్రస్తుతానికి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు, వకుళాభరణం కృష్ణమోహన్ రావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈటలను బిజెపిలో చేర్చుకొంటుండటంపై అలకపాన్పు ఎక్కిన బిజెపి సీనియర్ నేత ఈ.పెద్దిరెడ్డిని లేదా గత ఎన్నికలలో ఈటల చేతిలో ఓడిన సీనియర్ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌ రెడ్డిని పార్టీలోకి రప్పించి ఈటలపై పోటీ చేయించాలని టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేయబోతున్నారనే దానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.


Related Post