బిజెపికి ఓ షాక్..మమతా బెనర్జీకి మరో షాక్

June 12, 2021


img

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బిజెపికి ఒకేరోజున నిన్న షాకులు తగిలాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను బిజెపిలోకి తిప్పుకొంది. వారిలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడైన ముకుల్ రాయ్ కూడా ఒకరు. కానీ ఆయన నిన్న బిజెపికి గుడ్ బై చెప్పేసి మళ్ళీ తృణమూల్ గూటికి చేరుకొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ బిజెపిలో చేరడం తన రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు. మళ్ళీ ఎన్నడూ బిజెపివైపు చూడను,” అన్నారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరులను నయాన్నో భయాన్నో ఆకర్షించి ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలనుకొంది. కానీ ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా నెలరోజులు గడవక మునుపే ఇప్పుడు ఒకరొకరుగా బిజెపికి గుడ్ బై చెప్పేసి మళ్ళీ మమతా బెనర్జీ గూటికి చేరుకొంటుండటం బిజెపికి పెద్ద షాక్ అనే చెప్పాలి. 

అనేక అంశాలలో కేంద్రప్రభుత్వంతో విభేదిస్తున్న సిఎం మమతా బెనర్జీ, కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్-నేషన్, వన్-రేషన్’ పధకాన్ని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అమలుచేయడం లేదు. దీనిపై దాఖలైన ఓ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ‘ఈ పధకాన్ని ఎటువంటి సాకులు చెప్పకుండా రాష్ట్రంలో తక్షణమే అమలుచేయాలని’ ఆదేశించింది. ‘వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పధకాన్ని రాజకీయాలతో ముడిపెట్టి నిలిపివేయడం సరికాదని’ సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా గుడ్డిగా... వ్యతిరేకిస్తున్న సిఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు ఆదేశాలతో అయిష్టంగానైనా ఈ పధకాన్ని రాష్ట్రంలో అమలుచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కనుక ఇది ఆమెకు ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.


Related Post