వర్షాకాలం వస్తే అవే కబుర్లు...హామీలు!

June 11, 2021


img

ఏటా వర్షాకాలంలో హైదరాబాద్‌ నగరం నీట మునుగుతుండటం, అప్పుడప్పుడు భారీ వరదలు కూడా వస్తుండటం, అప్పుడు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడిగా ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు హామీలు ఇవ్వడం   సర్వసాధారణమైపోయింది. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ముంపు ప్రాంతాలలో పర్యటించి స్వయంగా సమస్యలను తెలుసుకొని వాటన్నిటినీ వచ్చే ఏడాదిలోగా పరిష్కరిస్తామని, వీలైనంత వరకు సమస్యలకు శాస్విత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.  

మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ అవే హామీలు ఇస్తుండటం గమనిస్తే గత ఏడాది హామీలు పూర్తిగా అమలుకాలేదని స్పష్టమవుతోంది. నగరంలో భారీ వర్షాలు కురిస్తే తీసుకోవలసిన ముందస్తు ఏర్పాట్ల గురించి మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ జీహెచ్‌ఎంసీ అధికారులతో ఈరోజు చర్చించారు. 

అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, “నగరంలో సుమారు 1,360 కిమీ పొడవునా నాలాలున్నాయి. వీటిలో పూడిక తీసేందుకు రూ.45 కోట్లు ఖర్చు చేయబోతున్నాము. పూడిక తీతకు కొత్తగా యంత్రాలను కొనుగోలు చేయబోతున్నాము. నగరంలోని నాలాల సమస్యకు శాస్విత పరిష్కారం చేస్తాము. వర్షాలు మొదలయ్యేలోగా అన్ని నాలాలలో పూడికలు తీసి, నాలాలు, చెరువులపై వెలసిన ఆక్రమణలు తొలగిస్తాము,” అని అన్నారు.


Related Post