ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కాబోతోందా?

June 11, 2021


img

యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ ఢిల్లీకి వెళ్ళి శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా యూపీ బిజెపి నేతలలో యోగీ... ఆయన పాలన పట్ల అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో సిఎంలను మార్చడం పరిపాటి. కానీ వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున, యోగీని మార్చేందుకు బిజెపి అధిష్టానం సిద్దంగా లేదు. అయితే రాష్ట్ర ప్రజలలో కూడా బిజెపి పాలన పట్ల అసంతృప్తి పెరుగుతున్నట్లు మోడీ ప్రభుత్వం గుర్తించడంతో ముఖ్యమంత్రిని మార్చే బదులు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి పశ్చిమప్రదేశ్, అవద్‌ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజలలో...పార్టీ నేతలలో నెలకొన్న అసంతృప్తిని సులువుగా అధిగమించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం ఆయా ప్రాంతాలలో ఈ డిమాండ్ కూడా ఉంది కనుక రాష్ట్ర విభజన చేసి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలలోని ప్రజలను ప్రసన్నం చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావచ్చని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే రాష్ట్ర విభజన అంటే తేనె తుట్టెను కదపడమే అవుతుంది కనుక ఈ అంశంపై లోతుగా చర్చించేందుకే ప్రధాని నరేంద్రమోడీ-యోగీ ఆధిత్యనాథ్ భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సిద్దపడితే యూపీలోని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించలేకపోవచ్చు. ఒకవేళ వ్యతిరేకిస్తే ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలకు ఆగ్రహం కలిగిస్తుంది. కనుక రాష్ట్ర విభజన కొంచెం కష్టమే అయినప్పటికీ అసాధ్యం కాదని స్పష్టం అవుతోంది. కనుక దేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రమైన యూపీ నాలుగు ముక్కలవుతుందా లేక అఖండంగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకొంటుందా?అనే విషయం రాబోయే కొన్ని నెలల్లో స్పష్టమవుతుంది.


Related Post