పెట్రోల్, డీజిల్ ధరల భారంతో నలిగిపోతున్న ప్రజలు

June 11, 2021


img

ఒకప్పుడు రూ.500కి బైకులో ట్యాంక్ ఫుల్ చేయించుకోగలిగేవారు కానీ ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.100 కి చేరడంతో కేవలం 5 లీటర్లే వస్తుంది. పెట్రోల్ ధరలు ఇంతగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

ప్రస్తుతం కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ఇంట్లో నుంచే పని చేసుకొంటున్నారు కనుక పెరిగిన ధరల ప్రభావం అంతగా తెలియడం లేదు. కానీ పరోక్షంగా ఆ భారాన్ని అందరూ మోస్తూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగిపోతున్నాయి. దాంతో కూరలు, నిత్యావసర సరకులు ధరలు పెరుగుతున్నాయి. అలాగే ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, టాక్సీలు నడిపించుకొని జీవనం సాగించేవారు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వారు కూడా ఆభారాన్ని ప్రజలపైనే వేయక తప్పడం లేదు. 

అసలే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అంతంత మాత్రం బిజినెస్‌తో తీవ్రంగా నష్టపోతున్న హోటల్స్, టిఫిన్ సెంటర్స్ కూరగాయలు, పప్పులు, నూనెలు గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగిపోతుండటంతో అవి కూడా ఆ భారాన్ని తమ వినియోగదారులపైనే వేస్తున్నాయి. 

ఈవిదంగా దేశంలో ప్రతీ ఒక్కరిపై, ప్రతీ రంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ధరలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలు ఉపాధి, ఉద్యోగం, ఆదాయం లేక విలవిలలాడుతుంటే, వ్యాపారసంస్థలు, పరిశ్రమలు తదితర రంగాలన్నీ ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. కానీ చమురు కంపెనీలు ఎవరి గోడు వినే స్థితిలో లేవు. 

ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే అవి పూర్తయ్యేవరకు కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవు కనుక ప్రజల గోడు కేంద్రానికి పట్టదు. పెట్రోల్, డీజిల్‌పై పన్ను రూపేణా భారీగా వస్తున్న భారీ ఆదాయాన్ని వదులుకోవడానికి, కనీసం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం అంగీకరించవు. 

కనుక పెరుగుతున్న ధరల కింద సామాన్య ప్రజలు నలిగిపోక తప్పడం లేదు. తమ గోడు వినే నాధుడే లేకపోవడంతో సామాన్య ప్రజలు మౌనంగా ఈ భారాన్ని భరిస్తూ బ్రతికేస్తున్నారు. 


Related Post