నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

June 11, 2021


img

తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్ళు, ఆయనకు చెందిన రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే లిమిటెడ్, మధుకాన్ ఇండస్ట్రీస్ కార్యాలయాలలో శుక్రవారం ఏకకాలంలో ఐదు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే లిమిటెడ్ సంస్థ రాంచీ నుండి జంషెడ్పూర్‌ వరకు 163 కిమీ హైవే రోడ్డు నిర్మించేందుకు జాతీయ రహదారుల సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ పత్రాలను చూపి కెనరా బ్యాంకు నుంచి రూ.1,064 కోట్లు రుణాలు తీసుకొంది. ఆ సొమ్ములో రూ.264 కోట్లు నామాకు చెందిన మధుకాన్ సంస్థకు దారి మళ్ళించిందనే ఆరోపణలతో 2020 లో సిబిఐ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంక్ నుంచి తీసుకొన్న డబ్బును అక్రమంగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మళ్ళించడంతో ఈ వ్యవహారంలో ఈడీ కూడా జోక్యం చేసుకొని వేరేగా మరో కేసు నమోదు చేసింది. ఆ కేసులోనే ఈడీ నేడు సోదాలు నిర్వహిస్తోంది. 

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు నామా నాగేశ్వరరావుకు టిఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం రావడంతో టిడిపికి గుడ్ బై చెప్పేసి టిఆర్ఎస్‌లో చేరి పోటీ చేసి గెలిచారు. ఖమ్మం సీటును గెలుచుకొనేందుకు టిఆర్ఎస్‌ అమలుచేసిన ఈ వ్యూహం ఫలించింది కానీ ఇటీవల ఈటల రాజేందర్‌పై అవినీతి ముద్ర వేసి బయటకు పంపించిన తరువాత ఇప్పుడు తమ ఎంపీ నామా నాగేశ్వర రావు కంపెనీలపై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేయడం, ఇప్పుడు సోదాలు నిర్వహించడం టిఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారనుంది. నామాపై టిఆర్ఎస్‌ అధిష్టానం చర్యలు తీసుకోమని ఈటల రాజేందర్‌ డిమాండ్ చేస్తే నామాను వెనకేసుకురాలేదు అలాగని ఆయనపై వేటు వేయలేదు. కనుక ఈ అవాంఛనీయ పరిణామాలు టిఆర్ఎస్‌కు, నామాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి.


Related Post