టిఆర్ఎస్‌ ఓట్లను ఈటల బిజెపికి మళ్లించగలరా?

June 10, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయకపోయినా ఏదో ఓ రోజున హుజూరాబాద్‌ ఉపఎన్నికలు జరుగడం ఖాయమని స్పష్టం అయ్యింది. కనుక ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ నేతలను, కార్యకర్తలను ఆకట్టుకోవడానికి ఈటల, టీఆర్ఎస్ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. మరికొన్ని రోజులలో ఈ పంపకాలు పూర్తయిపోవచ్చు కానీ ఉపఎన్నికలలో ప్రజలు ఎవరివైపు నిలుస్తారు? అనేది పెద్ద ప్రశ్న.

ఇంతకాలం టిఆర్ఎస్‌లో ఉన్న ఈటలను ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఆయన మతతత్వ పార్టీగా ముద్ర కలిగి ఉన్న బిజెపిలో చేరితే ఆదరిస్తారా? అంటే కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు టిఆర్ఎస్‌ పట్ల ప్రజలలో అభిమానం ఉంది. సిఎం కేసీఆర్‌ని చూసే ఆ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తున్నారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గంపై మంచి పట్టు, మంచి ప్రజాధారణ ఉన్నప్పటికీ ఇంతకాలం ఆయన టిఆర్ఎస్‌లో ఉన్నందునే ప్రజలు ఆయనను గెలిపించారని చెప్పవచ్చు. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలలో ఆయన బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తే అప్పుడు ప్రజలు బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీనే చూస్తారు తప్ప ఆయనను కాదు. టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేసినా సిఎం కేసీఆర్‌ను, గులాబీ జెండాను చూసే ఓట్లు వేస్తారు తప్ప అభ్యర్ధిని చూసి కాదు. అంటే ప్రజలు బిజెపిని, సిఎం కేసీఆర్‌ను పోల్చి చూసుకొంటే ఎవరికి ఓట్లు వేస్తారో సులువుగా ఊహించుకోవచ్చు. కనుక ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో మళ్ళీ గెలవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఈవిషయం బహుశః ఆయనకు, బిజెపికి కూడా తెలియదనుకోలేము. మరి టిఆర్ఎస్‌ను… కేసీఆర్‌ను ఏవిదంగా ఎదుర్కొంటారో చూడాలి.


Related Post