కేసీఆర్‌కు ఈటల విజ్ఞప్తి!

June 10, 2021


img

ఓ సినిమాలో హీరో తన ప్రేయసి తనపై కోపంతో ఉన్నా...తనను ద్వేషించినా... ఆవిదంగా కూడా ఆమె మనసులో తనను తలచుకొంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ‘నా ప్రేమను కోపంగానో...నా ప్రేమను ద్వేషంగానో...ఫీల్ మై లవ్’ అంటూ పాట పాడాడు. ఇప్పుడు తన విషయంలో కూడా సిఎం కేసీఆర్‌ ఆవిదంగానే వ్యవహరించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కోరుకొంటున్నారు!  

బుదవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లంతుకుంట మండల కేంద్రంలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా సిఎం కేసీఆర్‌ ఆ నియోజకవర్గంపై వరాలవాన కురిపిస్తుండటం అలవాటు. నా రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరుగబోతున్నాయి కనుక నా నియోజకవర్గంపై కూడా వరాలవాన కురిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరుకొంటున్నాను. 2018 శాసనసభ ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు దానిని అమలుచేయలేదు. కనుక ఇక్కడి ఓట్ల కోసమైన నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుకొంటున్నాను. 

అలాగే నియోజకవర్గంలో చిరకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయించి వాటికి బిల్లులు కూడా చెల్లించాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపఎన్నికలు జరిగేలోగా నియోజకవర్గంలో ఒక్క పనీ, ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేకుండా అన్ని క్లియర్ చేయాలని కోరుకొంటున్నాను. ప్రతీ గ్రామానికి అభివృద్ధి కోసం రూ.50 లక్షల నుంచి కోటి చొప్పున, ప్రతీ పరిషత్‌కు రూ.10 కోట్లు చొప్పున నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

సిఎం కేసీఆర్‌ నన్ను ద్వేషిస్తున్నప్పటికీ నా కారణంగా నా నియోజకవర్గానికి మంచి చేస్తానంటే స్వాగతిస్తాను. అయితే నేను బ్రతికి ఉండగానే నాకు బొంద పెట్టాలని మీరు తోడుకొన్న ఆ బొందలోనే మీ ప్రభుత్వం, మీ పార్టీ పడటం ఖాయం,” అని ఈటల రాజేందర్‌ అన్నారు. 



Related Post