ఇంతకీ ధర్మం ఎవరివైపు ఉందో?

June 08, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ్ళ కమలాపూర్ మండలంలో పర్యటించినప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామమని, దానిలో ధర్మమే...అంటే తానే గెలుస్తానని అన్నారు. ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాటం మొదలైందని అన్నారు. 

తొమ్మిదేళ్ళపాటు మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్‌ ఏనాడూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించలేదు. సిఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని చెప్పలేదు. సిఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని, అన్ని వర్గాలవారు సంతోషంగా ఉన్నారని చెప్పవారు. కానీ మంత్రి పదవి కోల్పోగానే ప్రజల ఆత్మగౌరవం, బడుగు బలహీనవర్గాల హక్కులు కోల్పోయారని ఈటల వాదిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.     

పేదల అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఈటల వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుండటాన్ని టిఆర్ఎస్‌ ఆక్షేపిస్తోంది. ఒకవేళ ఆయన పేదల ఆత్మగౌరవం కాపాడాలనుకొంటే ముందుగా తాను కబ్జా చేసిన భూములను వెనక్కు తిరిగి ఇచ్చేయాలని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. టిఆర్ఎస్‌ నేతలు చేస్తున్న ఈ సవాళ్ళకు ఈటల రాజేందర్‌ సూటిగా సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. ఈటల రాజేందర్‌ భావిస్తున్నట్లే, టిఆర్ఎస్‌ కూడా ధర్మం తన వైపు ఉందని భావిస్తోంది. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఎవరు గెలిస్తే వారివైపే ధర్మం ఉన్నట్లు భావించాల్సి ఉంటుందేమో?


Related Post