మెగా వాక్సిన్ డ్రైవ్‌తో తెలిసింది ఏమిటంటే...

June 08, 2021


img

మొన్న ఆదివారంనాడు హైదరాబాద్‌ హైటెక్స్‌లో మెడీకవర్ హాస్పిటల్స్, పోలీస్ శాఖ కలిసి నిర్వహించిన మెగా వాక్సిన్ డ్రైవ్‌లో ఒకే రోజున 40,000 మందికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చకచకా వాక్సిన్లు వేశారు. దీంతో రెండు విషయాలు అర్దమవుతున్నాయి. 1. సరైన ప్రణాళిక, తగినన్ని వాక్సిన్ డోసులు ఉంటే ఒకేరోజున వేలమందికి సులువుగా టీకాలు వేయవచ్చు. 2. ప్రైవేట్ ఆసుపత్రులకు తగినన్ని టీకాలు సరఫరా చేయగలిగితే దేశంలో ఉన్నతవర్గాలు లేదా ఎగువ మద్యతరగతి వారు డబ్బు చెల్లించి టీకాలు వేసుకొనేందుకు సిద్దంగా ఉన్నారు.

 కనుక ముందుగా వాక్సిన్ ఉత్పత్తిని పెంచి ఇటువంటి మంచి ప్రణాళికతో వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లయితే, ప్రజలు వాక్సినేషన్‌ సెంటర్స్ చుట్టూ ప్రదక్షిణాలు చేయక్కరలేదు. అక్కడ గంటల తరబడి పడిగాపులు కాయక్కరలేదని స్పష్టం అవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తగినన్ని వాక్సిన్లు సరఫరా చేయగలిగితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని మెగా వాక్సిన్ డ్రైవ్‌తో స్పష్టమైంది. 

కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సరిపడినన్ని వాక్సిన్లు సరఫరా చేయగలిగితే ఒకే రోజున 10 లక్షల మందికి టీకాలు వేసేందుకు అవసరమైన యంత్రాంగం ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కానీ వాక్సిన్ కొరత, వాక్సినేషన్‌ విధానంలో అయోమయం కారణంగా ఇంతకాలం ఒక్కో కేంద్రంలో 100-200 మందికి మాత్రమే వేస్తున్నారు.   

కనుక ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగా త్వరలోనే దేశ జనాభాకు సరిపడినన్ని వాక్సిన్లు అందుబాటులోకి వస్తే, ఇటువంటి మంచి ప్రణాళికతో నవంబర్‌లోగా దేశంలో 80 శాతం మందికి కాకపోయినా కనీసం 40-50 శాతం మందికి వాక్సినేషన్‌ చేయగలిగినా భారత్‌ కరోనా థర్డ్ వేవ్‌ను తట్టుకొని నిలబడగలదు.


Related Post