ఇకపై రాష్ట్రాలు కోవిడ్ టీకాలకు పైసా కూడా ఖర్చు చేయక్కరలేదు

June 07, 2021


img

ఈరోజు సాయంత్రం దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకాల ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలు చేయడం తదితర అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. 

“ఇకపై రాష్ట్రాలు టీకాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేదు. కేంద్రప్రభుత్వమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. ఇకపై 18 ఏళ్ళు పైబడిన వారందరికీ ఉచితంగా వేయబడతాయి. ఈ నెల 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతాము. వివిద కంపెనీలు తయారుచేసే టీకాలలో 75 శాతం ఉత్పత్తిని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. మిగిలిన 25 శాతం టీకాలను ఆయా కంపెనీలు ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవచ్చు. డబ్బు చెల్లించి టీకాలు వేసుకోవాలనుకొనేవారు ప్రైవేట్ ఆసుపత్రులలో వేసుకోవచ్చు. 

ప్రపంచంలో అన్ని దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. టీకాల తయారీ, క్లినికల్ ట్రయల్స్‌, ఉత్పత్తి, పంపిణీ విషయంలో భారత్‌ వెనుకబడిలేదు. టీకాలు తయారుచేస్తున్న కంపెనీలకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందజేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏడు కంపెనీలు టీకాలు తయారుచేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు తయారుచేసిన టీకాలు క్లినికల్ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. నాసల్ స్ప్రే (ముక్కులో స్ప్రే చేసుకొనే) టీకాల తయారీకి కూడా మన శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తున్నారు. చిన్న పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. అవి ఫలిస్తే చిన్నారులకు కూడా టీకాలు వేయగలుగుతాము. 

ఈ పోరాటంలో మన శాస్త్రవేత్తలు యుద్ధప్రాతిపదికన కేవలం ఆర్నెలల్లో ప్రపంచదేశాలతో పోటీ పడి వాక్సిన్లు తయారుచేసి అందించారు. ఇప్పటివరకు 23 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి చేసి పంపిణీ చేశాము. ఈ ఏడాది నవంబర్‌ నాటికి దేశ జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాము. 

కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం పెరగడంతో ఆక్సిజన్‌ ఉత్పత్తిని 10 రేట్లు పెంచాము. అందుబాటులో ఉన్న ప్రతీ రవాణా వ్యవస్థనీ ఉపయోగించుకొంటూ యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరా చేశాం. అయినప్పటికీ సెకండ్ వేవ్‌లో అనేకమంది ప్రజలు తమ ఆత్మీయులను కోల్పోవడం చాలా బాధ కలిగించింది. 

ఫస్ట్, సెకండ్ వేవ్‌ కరోనా నేర్పిన పాఠాలతో దేశంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకొనేందుకు అనేక చర్యలు చేపట్టాము. యావత్ ప్రపంచం ఓ అదృశ్యశక్తితో పోరాడుతోంది. మనం కూడా కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తాము,” అని అన్నారు.


Related Post