వ్యాక్సిన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా?

June 07, 2021


img

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ ఇద్దరూ వాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, దిగుమతి విషయంలో కేంద్రప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు. వాక్సిన్ల విషయంలో కేంద్రప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన యావత్ దేశ ప్రజలు నానాబాధలు పడుతున్నారని విమర్శించారు. 

అయితే ఈ సమస్య ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. దేశంలో వాక్సిన్లు పంపిణీ మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలు వాక్సిన్ కొరత ఎదుర్కొంటున్నాయి. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటిలో తెలంగాణ ప్రభుత్వం కోడా ఒకటి. కానీ ఇద్దరు కీలక మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ ఇప్పుడే ఎందుకు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు?అనే సందేహం కలుగకమానదు. 

బహుశః ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరుతుండటం అందుకు ఓ కారణం అయ్యుండవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వం యొక్క బలహీనతలు, లోపాలు, పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న ఈటల బిజెపిలో చేరడాన్ని అలనాడు రామాయణంలో విభీషణుడు శ్రీరాముడితో చేతులు కలపడంతో సరిపోల్చవచ్చు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలని కలలుకంటున్న బిజెపి, ఈటల సాయంతో టిఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక టిఆర్ఎస్‌ నేతల విమర్శలకు ఆ ఆందోళన కూడా ఓ కారణమై ఉండవచ్చు. 

సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే టిఆర్ఎస్‌ నేతలు కేంద్రప్రభుత్వంపై ఈవిదంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. ఈటల రాజీనామాతో ఆరు నెలలలోగా హుజూరాబాద్‌ ఉపఎన్నికలు జరుగుతాయి. కనుక ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర మంత్రులు ఇప్పటి నుంచే ఈవిదంగా యుద్ధం ప్రకటించి ఉండవచ్చు. దానికి కూడా వాక్సిన్ ఉపయోగపడుతుండటమే విశేషం.


Related Post