హుజూరాబాద్‌ ఉపఎన్నికలు...ఎవరి సమస్య వారిదే

June 05, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ లభిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఈటలను మంత్రి పదవిలో నుంచి అవమానకరంగా తొలగించడంతో ప్రజలలో ఆయన పట్ల కొంత సానుభూతి ఏర్పడటం సహజం. అదేవిదంగా పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కబ్జా చేశారనే తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా ప్రజలలో ఆయన పట్ల ఏహ్యత కూడా ఏర్పడి ఉండవచ్చు. ఈ నేపధ్యంలో ఆయన రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరుగబోయే ఉపఎన్నికలు ఇరు వర్గాలకు చాలా కీలకం కానున్నాయి. 

ఈటల సమస్య: ఈ ఉపఎన్నికలు ఈటలకు చాలా ముఖ్యం. ప్రజలు తన వాదనలను నమ్ముతున్నారని, వారు తనవైపే ఉన్నారని నిరూపించుకోవడం కోసం, మంత్రి పదవి ఊడగొట్టి తనను అవమానించిన సిఎం కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ ఉపఎన్నికలలో గెలవడం చాలా అవసరం. అలాగే తాను దమ్మున్న నాయకుడినని నమ్మి బిజెపి ఆహ్వానించింది కనుక అది ఈ ఉపఎన్నికలలో గెలిచి నిరూపించుకోవలసి ఉంటుంది లేకుంటే బిజెపిలో కూడా ఆయన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉంటుంది.  

బిజెపి సమస్య:  దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను కంగు తినిపించి నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో బిజెపి చతికిలపడింది. ఇప్పుడు ఈటల రాజేందర్‌ వంటి బలమైన, ప్రజాధారణ, సానుభూతి కలిగిన నేత పార్టీలో చేరబోతున్నారు కనుక ఈ ఉపఎన్నికలలో గెలిస్తే సాగర్ ఓటమికి ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది. అదే ఓడిపోతే ఈటల వంటి బలమైన నేత వచ్చినా టిఆర్ఎస్‌ ధాటికి బిజెపి నిలువలేదనే భావన ప్రజలలో కలుగుతుంది. టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటున్న బిజెపికి ఈ ఓటమి తీరని నష్టం కలిగిస్తుంది. కనుక ఈ ఉపఎన్నికలలో బిజెపి కూడా సర్వశక్తులు ఒడ్డి టిఆర్ఎస్‌తో పోరాడటం ఖాయం.    

టిఆర్ఎస్‌ సమస్య: ఈటల పట్ల ప్రజలలో ఎటువంటి సానుభూతిలేదని వారు టిఆర్ఎస్‌వైపే ఉన్నారని, ఈటల అవినీతిపరుని నిరూపించడం కోసం ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలవడం తప్పనిసరి. అదీగాక...సిఎం కేసీఆర్‌ వైఖరి పట్ల టిఆర్ఎస్‌ నేతలలో చాలా అసంతృప్తి నెలకొని ఉందని ఈటల చేసిన ఆరోపణలు తప్పని, కేసీఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని నిరూపించుకొనేందుకు ఈ ఉపఎన్నికలలో గెలవాల్సి ఉంటుంది.

భీకర యుద్ధం అనివార్యం: ఈటల చేసిన తీవ్ర విమర్శలు, ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోంది కనుక సిఎం కేసీఆర్ దెబ్బతిన్న పులిలా విజృంభించవచ్చు. సిఎం కేసీఆర్ చేసిన అవమానంతో ఈటల గాయపడిన పులిలా మారారు. కనుక ఆయన కూడా విజృంభించవచ్చు. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న వీరిరువురి మద్య జరుగబోయే ఈ యుద్ధంలో ఎవరు ఓడినా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి కనుక వారి మద్య చాలా భీకరమైన పోరు జరగడం ఖాయం. ఈ ఉపఎన్నికలు సిఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌కు మద్య అలాగే టిఆర్ఎస్‌-బిజెపిలకు మద్య జరుగుతున్న రెండు వేర్వేరు ఎన్నికలవంటివని భావించవచ్చు.


Related Post