కేసీఆర్‌ ఆనాడు ధర్మాన్ని...సంఘాన్ని నమ్ముకొన్నారు: ఈటల

June 04, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు ఉదయం శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ధర్మాన్ని, ప్రజలను, సంఘాలను నమ్ముకొన్నారు. అందుకే నాలుగు కోట్ల మంది మీ వెంట నడిచి కోట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నారు. కానీ తెలంగాణ ఏర్పడి మీరు ముఖ్యమంత్రి అయ్యాక నిరంకుశత్వం, అణచివేతలు, కుట్రలు, కుతంత్రలనే నమ్ముకొన్నారు. అందుకే అందరూ దూరమవుతున్నారు. 

ఆనాడు ఉద్యమ సమయంలో విద్యార్ధి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికుల మద్దతు తీసుకొని పోరాడారు. కానీ ఇప్పుడు వారెవరూ మీకు పనికి రాకుండాపోయారు. ఆర్టీసీ కార్మికులు రెండున్నర నెలలపాటు సమ్మె చేసినా, ఎంతో మంది కార్మికులు చనిపోతున్నా, చివరికి వాళ్ళే సమ్మె విరమించి మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోమని మిమ్మల్ని ప్రాధేయపడినా మీ మనసు కరుగలేదు. గతంలో వాళ్ళు తెలంగాణ కోసం చేసిన పోరాటాలు గుర్తుకు రాలేదు. చివరికి మీకు నచ్చినవిదంగా సమ్మె ముగింపజేశారు. ఆ తరువాత ఉద్యోగ సంఘాలు లేకుండా చేయాలని ప్రయత్నించారు. 

ఆనాడు అందరినీ కూడగట్టి ఉద్యమాలు చేసిన మీరు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎవరూ ధర్నాలు, సమ్మెలు, నిరసనలు తెలియజేయడానికి వీల్లేదన్నారు. ఇందిరా పార్కులోని ధర్నాచౌక్‌ని ఎత్తివేసి ప్రజాసంఘాలు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఎవరూ కూడా తమ సమస్యలను చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నట్లు ఆనాడు ఆంద్రాపాలకులు కూడా నిరంకుశంగా వ్యవహరించి ఉంటే మనం ఉద్యమాలు చేయగలిగేవాళ్ళామా...తెలంగాణ వచ్చి ఉండేదా?” అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.


Related Post