ఏడేళ్ళలో తెలంగాణలో పెనుమార్పులు... ప్రక్షాళనలు

June 02, 2021


img

తెలంగాణ ఏర్పడి నేటితో ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ ఏడేళ్ళలో రాష్ట్రంలో భౌగోళికంగా, పాలనాపరంగా పెను మార్పులు, ప్రక్షాళనలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం కొరకు 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా మారింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మళ్ళీ వాటిలో జనాభా ప్రాతిపదికన కొత్తగా మునిసిపల్ డివిజన్లు, వార్డులు ఏర్పడ్డాయి. అలాగే ఉద్యోగ నియమాకాలు, బదిలీలల సౌలభ్యం కోసం కొత్తగా జోనల్ విధానం ఏర్పడింది. ముప్పై మూడు జిల్లాలలో సమీకృత కలక్టర్ కార్యాలయాలు ఏర్పడుతున్నాయి. 

ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పాలనాపరమైన సంస్కరణలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సరికొత్త పారిశ్రామిక విధానాలు, ఐ‌టి పాలసీ, భవననిర్మాణ పాలసీ, పంట విధానాలు వగైరా వచ్చాయి. గతంలో అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లుగా ఉన్న అనేక నియమ నిబందనలను, విధివిధానాలను పక్కనపడేసి ఈ సరికొత్త విధానాలతో సత్ఫలితాలు, అభివృద్ధి సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని చెప్పవచ్చు. 

దేశంలో ఏ రాష్ట్రమూ చేయలేని సాహసం ‘సమగ్ర భూసర్వే’ మరియు ‘సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన’ తెలంగాణ ప్రభుత్వం చేసి చూపింది. అలాగే రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాలనే రూపొందించుకొని అమలుచేస్తోంది. రైతులకు ఎంతో వెసులుబాటు, ప్రయోజనం కల్పించేందుకు ధరణీ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఏడు దశాబ్ధాలుగా చేయలేని వీటన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం కేవలం ఏడేళ్ళలో చేసి చూపించి శభాష్ అనిపించుకొంటోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. 


Related Post