కాంగ్రెస్‌ను కాదని ఈటల బిజెపిని ఎందుకు ఎంచుకొంటున్నారు?

June 01, 2021


img

ఈటల రాజేందర్‌ మంత్రి వర్గం నుంచి బహిష్కరించబడిన తరువాత కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌లతో సహా రాష్ట్రంలో పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి తన భవిష్య కార్యాచరణ గురించి చర్చించారు. వారందరూ సిఎం కేసీఆర్‌ వైఖరిని, ఆయన పాలన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఈటల రాజేందర్‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ ఆయనను ఆహ్వానించగా, ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు సమైక్య వేదికను ఏర్పాటు చేసి పోరాటం కొనసాగిద్దామని కోరారు. కానీ ఈటల రాజేందర్‌ చివరికి బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు. 

అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌, తాను ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని వాదించారు. సిఎం కేసీఆర్‌ తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకే తనపై భూకబ్జా ఆరోపణలు మోపి ప్రజల దృష్టిలో చులకనయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. తనకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని దాని కోసం చివరివరకు పోరాడుతానని చెప్పారు. కానీ ఆ తరువాత తన సమస్యను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా అభివర్ణిస్తూ ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకొన్నట్లు చెపుతున్నారు!

ఒకవేళ భూకబ్జా కేసుల విషయంలో ఈటలకు భయం లేకపోయుంటే...తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే అయితే ఆయన ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటివారితో కలిసి పనిచేయవచ్చు కానీ తెలంగాణ ఉద్యమాలను ముందుండి నడిపిన కోదండరాం ఎటువంటి రాజకీయదుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. కనుక తెలంగాణ ఇచ్చిన పార్టీగా లౌకికవాదపార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినందున దానిలో చేరినా తనకు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదనే ఆలోచనతోనే చివరికి తన వైఖరికి, ఆలోచనలకు పూర్తి భిన్నమైన బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నారని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరడం ద్వారా భూకబ్జా కేసుల నుండి రక్షణ పొందాలని ఈటల ఆశిస్తున్నట్లున్నారు. కానీ అది సాధ్యమేనా? కాలమే చెపుతుంది.


Related Post