అప్పుడు ఉద్యమం కోసం...ఇప్పుడు ఆత్మగౌరవం కోసం: ఈటల జమున

May 31, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అర్ధాంగి ఈటల జమున ఆదివారం శామీర్‌పేటలో తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. “మేము అక్రమంగా ఆస్తులు సంపాదించుకొన్నామని ఆరోపిస్తున్నారు. దేవరయాంజల్‌లో మేము దేవుడి భూములను ఆక్రమించామని ఇప్పుడు చెపుతున్నారు. మరి ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు?వాటిపై బ్యాంకులు ఎందుకు అప్పులు ఇచ్చాయి?మా భూములపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మేమే కోరుతున్నాము కానీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత? చెప్పగలరా? 

ఆనాడు ఉద్యమకారులను కాపాడుకోవడం కోసం మా ఆస్తులను అమ్ముకొన్నాము. ‘తమ్ముడూ...’ అని పిలిచిన కేసీఆర్‌ ఇప్పుడు తడిగుడ్డతో మా గొంతు కోయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మా ఇంటి చుట్టూ, మా హ్యాచరీస్ చుట్టూ పోలీసులు, నిఘాబృందాలను ఎందుకు మోహరించారు? మేమేమైనా తీవ్రవాదులమా? ఇవన్నీ చూస్తుంటే ఆత్మగౌరవం కోసం పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక పాకిస్తాన్‌లో ఉన్నామా?అనే సందేహం కలుగుతోంది. ఆనాడు నయీమ్ బెదిరింపులకే మేము భయపడలేదు ఇప్పుడు మీ వేధింపులకు, బెదిరింపులకు మేము భయపడతామని ఎలా అనుకొన్నారు? ఆనాడు ఉద్యమాల కోసం మా ఆస్తులు అమ్ముకొన్నాము. ఇప్పుడు ఆత్మగౌరవం కోసం ఆస్తులు అమ్ముకోవడానికి సిద్దంగా ఉన్నాము. ఇప్పటి కంటే ఆనాడు ఉద్యమసమయంలోనే అందరం చాలా ఆత్మగౌరవంతో బ్రతికాము,” అని ఈటల సతీమణి జమున సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 


Related Post