థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశంలో మళ్ళీ అనుకూల వాతావరణం?

May 29, 2021


img

2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ జాతీయ స్థాయిలో చాలా బలపడింది. అనేక రాష్ట్రాలలో కూడా అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో 130 సం.ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోయింది. దేశంలో బిజెపి ఇంతగా బలపడటానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు కారణం కాగా, కాంగ్రెస్ పార్టీ కుచించుకుపోవడానికి నాయకత్వ సమస్య ప్రధాన కారణంగా కనిపిస్తోంది.  

మోదట్లో దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీకి నీరాజనాలు పట్టినప్పటికీ పెద్ద నోట్ల రద్దుతో సహా పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఆయన ఇమేజ్ దెబ్బతింది. కానీ దానిని సర్జికల్ స్ట్రైక్స్ తో అధిగమించారు. మళ్ళీ గత లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలు, ఈసారి కరోనా కట్టడిలో వైఫల్యాలు, మందులు, ఆక్సిజన్, వాక్సిన్ కొరత వంటి మరికొన్ని కారణాలతో ప్రధాని మోడీ ప్రతిష్ట కొంత మసకబారిందని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉండటం బిజెపికి చాలా కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ఒకవేళ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఉంటే నేడు మోడీ ప్రభుత్వం ఇన్ని తప్పటడుగులు వేసి ఉండేది కాదేమో?

ఒకవేళ ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు వస్తే దేశ ప్రజలు నాయకత్వ సమస్యతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మొగ్గు చూపలేరు కనుక మళ్ళీ బిజెపికి, నరేంద్రమోడీ వైపే మొగ్గు చూపక తప్పదు. బహుశః ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి కూడా బాగా తెలిసే ఉండవచ్చు. కానీ కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్ గాంధీ వైఖరిలో ఎటువంటి మార్పు, కొత్త ఆలోచనలు కలుగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

జాతీయ స్థాయిలో ఇటువంటి రాజకీయ శూన్యత నెలకొని ఉన్నట్లు సిఎం కేసీఆర్‌, చంద్రబాబునాయుడు వంటివారు చాలా కాలం క్రితమే గుర్తించారు కనుకనే వారిరువురూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించారని చెప్పవచ్చు. ఒకవేళ    వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ పార్టీలో... దాని ఆలోచనా వైఖరిలో ఎటువంటి మార్పులు రానట్లయితే, ఈసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించవచ్చు. 


Related Post