ఇక్కడ వాక్సిన్లు కరువు... అక్కడ మనుషులు కరువు!

May 29, 2021


img

అక్కడ టీకాలున్నాయి కానీ వేసుకొనేందుకు మనుషులు లేరు. ఇక్కడ మనుషులున్నారు కానీ వేసుకొనేందుకు టీకాలు లేవు. అక్కడ టీకాలు వేసుకొంటే ప్రభుత్వాలు డబ్బులిస్తున్నాయి. ఇక్కడ టీకాలు కావాలంటే డబ్బులిచ్చి వేసుకొనే పరిస్థితి. అది అమెరికా... ఇది భారత్‌!

భారత్‌లో కోట్లాది మంది ప్రజలు నేటికీ టీకాల కోసం ఎదురుచూపులు చూస్తుంటే, అమెరికాలో టీకాలు వేస్తామంటే వచ్చేవారేలేరు! కాలిఫోర్నియా రాష్ట్రంలో సుమారు 3.5 కోట్లు జనాభాలో 63 శాతం మంది మాత్రమే టీకాలు వేసుకొన్నారు. మిగిలినవారు ప్రభుత్వం ఎంత బ్రతిమాలుతున్నా టీకాలు వేసుకొనేందుకు రావడం లేదు. దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించేందుకు టీకాలు వేసుకొనేవారికి ఏకంగా 116 మిలియన్ డాలర్లు బహుమతిగా ప్రకటించింది!

కనీసం ఒక్క డోస్‌కు టీకా వేసుకొన్నవారు కూడా దీనికి అర్హులే. టీకాలు వేసుకొన్నవారందరి పేర్లతో లాట్రీ వేసి ఆ నగదు బహుమతులు పంచిపెడతామని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌కు 4వ తేదీ నుంచి మొదలయ్యే ఈ లక్కీ డ్రాలో మొదటి 10 మందికి భారత్‌ కరెన్సీలో రూ.10.86 కోట్లు, మరో 30 మందికి రూ.36.21 లక్షలు చొప్పున నగదు బహుమతి ఇస్తారు. మరో 20 లక్షల మందికి రూ.3,600 విలువ కలిగిన గిఫ్ట్ కార్డులు అందజేస్తారు. 

అమెరికాలోని ఒహియో, కొలరాడో, ఒరెగాన్ ప్రభుత్వాలు కూడా ఒక్కో మిలియన్ డాలర్లు చొప్పున నగదు బహుమతి ఇస్తున్నాయి. న్యూయార్క్‌లో 12-17 వయసున్న విద్యార్దులలో టీకాలు వేసుకొన్నవారికి లక్కీ డిప్ పెట్టి అందులో విజేతలకు స్కాలర్ షిప్ ఇస్తోంది. న్యూజెర్సీ ప్రభుత్వం మొదటి డోస్‌కు వేసుకొన్న ప్రతీ ఒక్కరికీ ఉచితం బీరు అందిస్తోంది. ఇంకా అమెరికాలో వివిద రాష్ట్రాలు ప్రజలను టీకాలు వేసుకొనేందుకు ప్రోత్సహించేందుకు ఆకర్షణీయమైన పధకాలు ప్రకటిస్తున్నాయి. 

భారత్‌ ప్రజలకు ఏ బహుమానాలు అక్కరలేదు పదిసార్లు తిప్పించుకోకుండా రెండు డోసులు టీకాలు వేస్తే అదే పది మిలియన్ డాలర్లకు సమానం.


Related Post