భారత్‌లో మళ్ళీ రాజరిక వ్యవస్థ రాబోతోందా?

May 29, 2021


img

రెండు, మూడు దశాబ్ధాల క్రితం వరకు భారత్‌లో రాజకీయాలు ఒకలా ఉండేవి ఇప్పుడు వేరేలా ఉన్నాయి. అప్పుడూ ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరిగేది. నేతలు పార్టీలు మారేవారు. ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ఇచ్చి నిలబెట్టుకొనేవారు కారు. కానీ పార్టీలు... వాటి నేతలు ఎన్నికలలోనే బలాబలాలు తేల్చుకోనేవారు. కానీ ఆ తరువాత రాజకీయాలు చేసే విధానమే సమూలంగా మారిపోయింది. 

ఇప్పుడు జాతీయ స్థాయిలో కావచ్చు...రాష్ట్ర స్థాయిలో కావచ్చు అధికారంలో ఉన్నవారు నయన్నో భయాన్నో ప్రతిపక్ష నేతలను, వారి ప్రజాప్రతినిధులను ఫిరాయింపజేసుకోవడం...ఒకవేళ లొంగకపోతే వారిపై సిబిఐ, ఐ‌టి, ఈడీ, ఏసీబీల చేత దాడులు చేయించడం, వారిని అవినీతి, అక్రమార్కులుగా ముద్రవేసి వీలైతే జైలుకి పంపించడం లేదా ప్రజలు అసహ్యించుకొనేలా చేయడం వంటివి నేటి రాజకీయాలలో సర్వసాధారణమైపోయాయి. 

అసలు ప్రతిపక్షాలే లేకుండా చేసుకొని శాస్వితంగా లేదా చిరకాలం తామే అధికారంలో కొనసాగాలనుకొంటున్న రాజకీయ పార్టీలను, నేతలను మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిపక్షాలే లేకుండా చేసుకొని, మిగిలున్నవాటిపై సామదానబేధదండోపాయాలన్నీ ప్రయోగిస్తూ ఎన్నికలు నిర్వహించుకొంటూ మనది చాలా గొప్ప ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకొంటున్నాము. 

ప్రస్తుతం జాతీయ..రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చూసినా రాచరిక, నియంతృత్వ పోకడలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అవలక్షణాలు పార్టీలలోకి... ప్రభుత్వాలలోకి కూడా పాకిపోయినందున ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు పార్టీలోను... ప్రభుత్వంలోనూ ఎవరూ అధిష్టానాన్ని ప్రశ్నించలేని కనీసం మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత ఏది చేస్తే అదే కరెక్ట్...ఆయన లేదా ఆమె మాటే శాసనంగా మారుతోందిప్పుడు. ఒకవేళ ప్రభుత్వాధినేత అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటే వాటికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించవలసి వస్తోంది. దేశంలో జరుగుతున్న వివిద పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి.  

ఎక్కడైనా ఓ వ్యవస్థలో క్రమేపీ లోటుపాట్లను సరిదిద్దుకొంటూ మరింత మెరుగవుతుంది కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏడు దశాబ్ధాల తరువాత మళ్ళీ రాచరికపాలనగా మారుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేవిదంగా కొనసాగుతూ పోతే చివరికి ఏమవుతుంది?అని అందరూ ఆలోచించి విజ్ఞతతో వ్యవహరించడమే ఈ సమస్యలకు ఏకైక పరిష్కారం.


Related Post