కరోనా సెకండ్ వేవ్‌...మరణాలకు మోడీయే బాధ్యుడు: రాహుల్ గాంధీ

May 29, 2021


img

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో తన నివాసం నుంచి వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. “భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రావడానికి... దానిలో వేలాదిమంది మరణించడానికి ప్రధాని నరేంద్రమోడీయే బాధ్యుడు. ఆయనకు కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలో సరైన అవగాహన లేకపోవడం వలన కరోనాను కూడా ఓ ఈవెంట్‌లా భావించి తేలికగా తీసుకొన్నారు. అందువల్లే దేశంలో ఇంత విధ్వంసం జరిగింది. కనీసం వాక్సినేషన్ విషయంలోకూడా కేంద్రప్రభుత్వానికి సరైన విధానం లేదు. లాక్‌డౌన్‌, మాస్కూలు ధరించడం, భౌతికదూరం పాటించడం వలన కరోనా వ్యాప్తిని  తాత్కాలికంగా ఆపగలము కానీ కరోనాను వదిలించుకోలేము. దేశ ప్రజలందరికీ వాక్సిన్లు వేయడం ద్వారానే కరోనా బెడద నుంచి తప్పించుకోగలుగుతాము లేకుంటే దేశంలో ఇంకా థర్డ్.. ఫోర్త్ వేవ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దేశ జనాభాలో కేవలం 3 శాతం ప్రజలకు మాత్రమే ఇంతవరకు వాక్సిన్లు వేసి మిగిలిన 97 శాతం మంది ప్రజలను కరోనా మహమ్మారి దయకు విడిచిపెట్టారు. తద్వారా యావత్ ప్రపంచదేశాలకు భారత్‌ నుంచి మళ్ళీ కరోనాను వ్యాపింపజేసే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా సరైన వాక్సిన్ విధానం రూపోడించుకొని దానిని సమర్ధంగా అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,” అని అన్నారు.      


Related Post