ప్రధాని మోడీకి చేదు అనుభవం

May 29, 2021


img

అవును ప్రధాని నరేంద్రమోడీకే...పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల యాస్ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన తరువాత బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో కాలైకుండ వైమానిక స్థావరానికి చేరుకొన్నారు. అక్కడ ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ స్వాగతం పలుకలేదు! ఆ తరువాత రాష్ట్రంలో తుఫాను వలన కలిగిన నష్టం గురించి తెలుసుకొనేందుకు సిఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలనుకొన్నారు. కానీ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధన్కర్ తప్ప ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. సుమారు అర్ధగంటసేపు వేచి చూసిన తరువాత మమతా బెనర్జీ, సీఎస్ వచ్చి యాస్ తుఫానుపై ఓ నివేదిక సమర్పించి దిఘా అనే ప్రాంతంలో తాము పర్యటించవలసి ఉందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు. వారు కేవలం ఒక్క నిమిషం మాత్రమే అక్కడున్నారు!      

ప్రధానమంత్రి రాష్ట్రానికి సాయం చేసేందుకు వస్తే సిఎం మమతా బెనర్జీ ఆయనను అవమానించారని, ప్రధాని సమీక్షా సమావేశానికి అధికారులు ఎవరూ వెళ్ళకుండా అడ్డుకొన్నారని రాష్ట్ర బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అందుకే తాము హాజరుకాలేకపోయామని అధికారులు చెపుతున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు ముందు తృణమూల్ నేతలను నయాన్నో, భయాన్నో బిజెపిలో చేర్చుకోవడం, ఎన్నికల తరువాత ఇద్దరు తృణమూల్ మంత్రులను సిబిఐ అరెస్ట్ చేయడం వంటివి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రజామోదంతో గెలిచిన తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. అందుకే ఆమె ప్రధాని నరేంద్రమోడీతో ఈవిదంగా వ్యవహరించి ఉండవచ్చు. 

గతంలో చంద్రబాబునాయుడు కూడా ప్రధాని నరేంద్రమోడీతో ఇదే విదంగా వ్యవహరించారు. చివరికి ఏమి జరిగిందో అందరూ చూశారు. ఏది ఏమైనప్పటికీ దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది.   



Related Post