మే 31 నుంచి ఢిల్లీలో అన్‌లాక్‌ షురూ

May 28, 2021


img

గత ఏడాది భారత్‌లో తొలిసారి కరోనా ప్రవేశించినప్పుడు, మళ్ళీ ఈ ఏడాది సెకండ్ వేవ్ వచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్ధిక రాజధాని ముంబై చాలా అల్లాడిపోయాయి. ముంబై నగరం ఇప్పుడిపుడే కొలుకొంటుండగా, ఈ నెల 31 నుంచి ఢిల్లీలో దశలవారీగా లాక్‌డౌన్‌ సడలించడానికి కేజ్రీవల్ ప్రభుత్వం సిద్దమవుతోంది. 

దేశంలో అన్ని రాష్ట్రాలు, నగరాల కంటే ముందుగా ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువకు చేరుకోవడంతో ఈ నెల 31 వ తేదీ నుంచి దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయబోతున్నట్లు కేజ్రీవల్ చెప్పారు. ముందుగా దుకాణాలు, మార్కెట్స్, షాపింగ్ మాల్స్ మొదలైనవాటికి సడలింపులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు ఢిల్లీలోని అన్ని పరిశ్రమలను, నిర్మాణ కార్యకలాపాలను అనుమతించబోతున్నట్లు చెప్పారు.  

కరోనా కట్టడిలో డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. కరోనా సెకండ్ వేవ్ మొదలవగానే లాక్‌డౌన్‌ విధించి చేతులు దులుపుకోకుండా, ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, మందులు, ఆక్సిజన్‌ వంటి సకల సదుపాయాలను శరవేగంగా సమకూర్చుకొన్నారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు జరిపిస్తూ కరోనా రోగులను గుర్తించి వారి ద్వారా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. కరోనా వచ్చిన తరువాత చికిత్స చేయడం కంటే అది సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చేయడమే సులువు అని గ్రహించిన అరవింద్ కేజ్రీవాల్ వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయించి ఢిల్లీ ప్రజలకు చైతన్యం కలిగేలా చేశారు. 

అంతేకాదు...కరోనా రోగులకు ఇళ్ళ వద్దకే ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసి అనేకమంది ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి, ఆదాయం కోల్పోయిన నిరుపేదలకు నిత్యం ఆహారం లేదా నిత్యావసర సరుకులు అందజేశారు. మరోపక్క వీలైనంత మందికి టీకాలు వేయించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఒకేసారి సమాంతరంగా ఇన్ని చర్యలు చేపట్టడంతో ఢిల్లీలో కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చింది. కరోనా మహమ్మారి నేర్పిన పాఠాలతో మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకొన్నారు. రష్యా నుంచి స్పుత్నిక్ వి వాక్సిన్లు తెప్పించి ఢిల్లీలో ప్రతీ ఒక్కరికీ టీకాలు వేయించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఒక ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి సమర్ధంగా వ్యవహరిస్తే కరోనా వంటి మహమ్మారిని కూడా ఏవిదంగా అణిచివేయవచ్చో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చేసి చూపించారు. 


Related Post