బిజెపిలో ఈటల చేరికపై పెద్దిరెడ్డి అసంతృప్తి

May 28, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరడం ఖాయం అన్నట్లు రాష్ట్ర బిజెపి నేతలు చెపుతున్న మాటలు, టీవీలో వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి స్పందించారు. 

కరీంనగర్‌లో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ విషయం గురించి మా పార్టీ నేతలెవరూ నాకు మాట మాత్రంగానైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఒకవేళ ఈటల రాజేందర్‌ నాకంటే సమర్ధుడు, పార్టీకి ఆయన అవసరం ఉందని భావిస్తే అదే విషయం నాకు చెప్పి ఉంటే బాగుండేది. కానీ ముందూ వెనుకా చూడకుండా ఆయనను హడావుడిగా పార్టీలో చేర్చుకోవడానికి సిద్దపడుతున్నారు. ఆయనను నిర్ధిష్టమైన అభియోగాలతో మంత్రివర్గం నుంచి తొలగించబడ్డారు. ఒకవేళ రేపు న్యాయస్థానంలో ఆయన దోషిగా తేలితే అప్పుడు బిజెపియే ప్రజల ముందు తల దించుకోవలసి ఉంటుంది కదా?ఆయన తనపై మోపబడిన కేసుల నుంచి తప్పించుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న మా పార్టీలో చేరుతున్నారని అందరికీ తెలుసు. ఇన్నేళ్ళుగా ఆయనతో పోరాడుతున్న జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆయనను పార్టీలో చేర్చుకోవడం తొందరపాటు నిర్ణయమే అని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

ఒకవేళ ఈటలను పార్టీలో చేర్చుకొన్నట్లయితే పెద్దిరెడ్డి తన అనుచరులతో కలిసి పార్టీ వీడే అవకాశం ఉంది. కనుక  ఈటల రాజేందర్‌ చేరికపై బిజెపి ఆలోచించుకొని అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.


Related Post