ఈటలతో కొండా, కోదండ భేటీ... దేనికో?

May 27, 2021


img

ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తుండటంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ్ళ ఆయనతో భేటీ అయ్యారు. తరువాత వారిరువురూ మీడియాతో మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌పై సిఎం కేసీఆర్‌ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు.  

అయితే వారి భేటీలో ముగ్గురూ ఏమి చర్చించుకొన్నారో... ఏమి నిర్ణయించుకొన్నారో చెప్పనేలేదు. ఒకవేళ ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరేమాటైతే ప్రొఫెసర్ కోదండరాం ఆయనకు రాజకీయంగా దూరమవుతారు. ఒకవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బిజెపిలో చేరినట్లయితే ఆయనకూ కోదండరాం దూరమవుతారు. కనుక ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరాలా వద్దా?చేరకుంటే ముగ్గురూ కలిసి ఏవిదంగా ముందుకు సాగాలి? అనే విషయంపై చర్చించి ఉండవచ్చు. 

అయితే ఈటలపై చర్యలు తీసుకోవడానికి టిఆర్ఎస్‌ సిద్దం అవుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమే అనుకొంటే, ఈటల రాజేందర్‌ వీలైనంత త్వరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దానిపైనే ఆయన భవిష్యత్ రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది కనుక అది నూటికి నూరు శాతం సరైనదై ఉండాలి కూడా.


Related Post