ఈటల రాజీనామా ఆత్మహత్యతో సమానం: జితేందర్ రెడ్డి

May 26, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బిజెపిలో చేర్చుకొనేందుకు ఆయనతో ఇటీవల సంప్రదింపులు జరిపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌లో సీనియర్ నాయకుడు, మంత్రి అయిన ఈటల రాజేందర్‌కు చాలా అన్యాయం, అవమానం జరిగాయని నేను భావిస్తున్నాను. అయనను మా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము. బిజెపిలో చేరడంపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇటీవల ఆయనను కలిసినప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించాము. ఈ సందర్భంగా ఆయనకు నేను ఓ సలహా ఇచ్చాను. తనకు జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్‌ ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తుండమని చెప్పాను. అయితే టిఆర్ఎస్‌ నేతలు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయద్దని గట్టిగా చెప్పాను. ఆలాచేస్తే ఉపఎన్నికలు ఎదుర్కోవలసి వస్తుంది. అది ఆయనకు రాజకీయంగా ఆత్మహత్యతో సమానం అవుతుంది. టిఆర్ఎస్‌ నేతలు అందుకే ఆయన రాజీనామా చేయమని సవాళ్ళు విసురుతున్నారు. టిఆర్ఎస్‌ ఉచ్చులో చిక్కుకోవద్దని నేను ఈటల రాజేందర్‌కు చెప్పాను,” అని అన్నారు.  

ఒకవేళ ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే టిఆర్ఎస్‌ ఆయనపై అనర్హత వేటు వేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక అనర్హత వేటు తప్పించుకోవాలనుకొంటే ఈటల రాజేందర్‌ రాజీనామా చేయక తప్పకపోవచ్చు.


Related Post