మార్గదర్శకాలు సరే...కానీ వాక్సిన్లు ఎక్కడున్నాయి?

May 26, 2021


img

కరోనా వాక్సిన్ల పంపిణీ కొరకు కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కేంద్ర మార్గదర్శకాల కంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా వాక్సిన్లు వేసేందుకు అనుమతించడంతో రాష్ట్రంలో మరింత వేగంగా వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగేందుకు ఇది తోడ్పడుతుంది. 

అయితే సీరం, భారత్‌ బయోటెక్ కంపెనీల నుంచి వాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే ఫలించడం లేదని కనుకనే గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నామని మంత్రి హరీష్‌రావే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికే వాక్సిన్లు లభించనప్పుడు ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు ఏవిదంగా లభిస్తాయి?

ఇప్పుడు వాక్సిన్ పంపిణీ, వాక్సినేషన్‌ సమస్య కానేకాదు... దేశ అవసరాలకు సరిపడా వాక్సిన్ల ఉత్పత్తికాకపోవడమే ప్రధాన సమస్య. కనుక ఆ స్థాయిలో వాక్సిన్లు ఉత్పత్తి అయ్యేంతవరకు ఈ వాక్సిన్ కొరత సమస్య తప్పదు. అయితే రాబోయే ఆరు నెలల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తో సహా భారత్‌లో మరో నాలుగైదు కంపెనీలు కూడా భారీ ఎత్తున వాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాయి కనుక అవి కూడా అందుబాటులోకి వస్తే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు వాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా తోడ్పడతాయని భావించవచ్చు. 


Related Post