వ్యాక్సిన్‌ విధానంలో ఇంత తడబాటు దేనికో?

May 25, 2021


img

కోవిడ్ టీకాల విషయంలో కేంద్రప్రభుత్వం మొదట సమర్ధంగానే కార్యాచరణ ప్రణాళిక రచించుకొని అమలుచేసినప్పటికీ, ఆ తరువాత వరుసగా తప్పటడుగులు వేస్తూ నవ్వులపాలవుతోంది. టీకాల విషయంలో తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు గమనిస్తే ఆవిషయం అర్ధమవుతుంది. 

టీకాలు వృధాకాకుండా అరికట్టడం కోసం 18-45 ఏళ్ళలోపువారు కోవిన్ మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా నేరుగా ప్రభుత్వ టీకా కేంద్రాలవద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకాలు వేసుకోవచ్చునని ప్రకటించింది. అయితే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో టీకాల లభ్యతను బట్టి ఆయా ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

అమూల్యమైన కోవిడ్ టీకాలు వృధా కాకూడదనే ఆలోచన సరైనదే అయితే ఇందుకోసం మళ్ళీ ఇటువంటి సవరణ చేయడం వలన మొదటి డోస్‌ టీకాల కోసం ఎదురుచూస్తున్న కోట్లాదిమంది ఒకేసారి టీకాల కోసం తరలివచ్చే అవకాశం ఉంది. ఒక్కడోస్ కూడా వేసుకోని వారిలో కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఒకేసారి వారు టీకా కేంద్రాల వద్దకు తరలివస్తే అక్కడే టీకా కేంద్రాల వద్దే మళ్ళీ కరోనా వ్యాపించడం మొదలవుతుంది. 

కేంద్రప్రభుత్వం ఈవిదంగా చీటికిమాటికీ టీకాల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తుండటం వలన ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నట్లు అవుతోందే తప్ప మరేమీ ప్రయోజనం ఉండటం లేదు. కనుక ఇకపై టీకాల వేసే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా ఆ బాధ్యతను రాష్ట్రాలకే విడిచిపెట్టి అవి కోరినన్ని టీకాలను సరఫరా చేయడంపై దృష్టి పెడితే మంచిదేమో?


Related Post