కరోనా లీలలు ఎన్నో?

May 24, 2021


img

కరోనా మహమ్మారి అడుగుపెట్టని దేశం లేదు...వదిలిపెట్టిన మనిషి లేడు. దేశాల మద్య…దేశాలలోని రాష్ట్రాలు...జిల్లాల మద్య కనబడని అడ్డుగోడలు కట్టుకొనేలా చేస్తోంది. కుటుంబాలను చెల్లాచెదురు చేస్తోంది. మనుషులలో మానవత్వాన్ని మంట గలుగుపుతున్నదీ అదే...మనుషులలో దాగి ఉన్న మానవత్వాన్ని వెలికి తెస్తున్నదీ అదే! 

కరోనా పుణ్యామాని ఇప్పుడు యావత్ ప్రపంచం దేశాల మద్య కనబడని గీతలేర్పడ్డాయి. భారత్‌ నుంచి వచ్చేవారిపై అనేక దేశాలు ఆంక్షలు లేదా నిషేదం విధిస్తున్నాయి. ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సరిహద్దులవద్ద పోలీసులను మొహరించుకొని పొరుగు రాష్ట్రం నుంచి ఎవరూ రాకుండా అడ్డుకొంటున్నాయి. చాలా రాష్ట్రాలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 

ఇక కుటుంబాలలో పెళ్ళిళ్ళు, శుభకార్యాల మాట దేవుడెరుగు...తల్లితండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లలు, ఆత్మీయులు చనిపోతే కనీసం కడసారి చూపుకు నోచుకోలేని దుస్థితి...కనీసం ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి సర్వత్రా నెలకొంది. కరోనా సోకిందని వృద్ధులైన తల్లితండ్రులను ఆసుపత్రులలో... రోడ్లపై విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఇటువంటివి చూస్తున్నప్పుడు మనుషులలో అసలు మానవత్వమానేది ఉందా లేదా?అనే సందేహం కలుగకమానదు. కానీ ఉందని అనేక మంది నిరూపిస్తున్నారు. 


నిసహాయంగా ఉన్న కరోనా రోగులకు, లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదలకు ప్రతీరోజు పౌష్టికాహారం వండి పంపిస్తున్న మానవతామూర్తులు హైదరాబాద్‌లోనే కోకొల్లలున్నారు. ఆత్మీయులు చనిపోతే ఎవరూ రాకపోయినా మేమున్నామంటూ వస్తున్న ‘ఆ నలుగురూ...’ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. రోడ్లపై తిరిగే ఆవులు, కుక్కలు వంటి జంతువులకు, పక్షులకు కూడా ఆహారం అందించే జంతు ప్రేమికులు ఇప్పుడు కనిపిస్తున్నారు. 



ఓ పక్క మనుషులను...వారిలో మానవత్వాన్ని కూడా చంపేస్తున్న కరోనా మహమ్మారే అదే మనుషులలో మానవత్వాన్ని తట్టిలేపుతుండటం విశేషమే కదా? ఏది ఏమైనప్పటికీ ఈ కరోనా మహమ్మారి మానవాళికి ఎంత కీడు చేస్తోందో...ప్రతీ ఒక్కరికీ అనేకానేక జీవితపాఠాలు కూడా నేర్పిస్తోందని చెప్పవచ్చు. 


Related Post