కొందామన్నా వ్యాక్సిన్లు దొరకడం లేదు: మంత్రి హరీష్‌

May 22, 2021


img

భారత్‌ను ఓ వైపు కరోనా మహమ్మారి కబళించివేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు వాక్సిన్లు తయారైనప్పటికీ దేశ జనాభాకు సరిపడినన్ని ఉత్పత్తి చేసుకోలేకపోవడం వలన ప్రజలు కరోనాకు బలైపోతూనే ఉన్నారు. వాక్సిన్ల ఉత్పత్తి, సరఫరాలపై మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేవిగా ఉన్నాయి. 

శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “చేతిలో డబ్బులు ఉన్నా వాక్సిన్లు కొనుకొనే అవకాశం లేదు. అమ్మ పెట్టదు....అడుక్కొని తిన్నివద్దన్నట్లు కేంద్రం వాక్సిన్లు ఇవ్వలేదు. పోనీ...ఆ కంపెనీలకు డబ్బు చెల్లించి వాక్సిన్లు కొనుకొందామంటే ఒప్పుకోదు. ఏ రాష్ట్రానికి ఎన్ని వాక్సిన్లు ఇవ్వాలో కేంద్రప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే ఆ రెండు కంపెనీలు వాక్సిన్లను సరఫరా చేయవలసివస్తోంది. 

వాక్సిన్ల కోసం సిఎం కేసీఆర్‌ వంద కోట్లు అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే కోవీషీల్డ్, కోవాక్సిన్లు రాష్ట్రానికి వచ్చాయి. ఈవిదంగా ఇంకా ఎంతకాలం సాగుతుంది? రాష్ట్రంలో ప్రజలందరికీ ఎప్పటికీ వాక్సినేషన్‌ చేయగలుగుతాము? డబ్బిచ్చినా దేశంలో వాక్సిన్లు కొనే పరిస్థితులు లేవు అందుకే గ్లోబల్ టెండర్లు పిలిచాము. త్వరలోనే విదేశాల నుంచి సరిపడా వాక్సిన్లు దిగుమతి చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ వాక్సినేషన్‌ చేయించాలని సిఎం కేసీఆర్‌ ధృఢనిశ్చయంతో ఉన్నారు,” అని అన్నారు. 

ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అయితే ప్రజల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. దేశంలో నానాటికీ కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో ఇంతవరకు ఒక్క డోస్‌ కూడా తీసుకొని కోట్లాదిమంది ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వారు వాక్సిన్ కోసం ఎంత డబ్బు అయినా చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. కానీ ఎక్కడా వాక్సిన్లు లేవు! దాంతో ఏమి చేయాలో పాలుపోక భయాందోళనలతో భారంగా రోజులు గడుపుతున్నారు. కనుక విదేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. త్వరలోనే విదేశాల నుంచి రాష్ట్ర జనాభాకు సరిపడా వాక్సిన్లు వస్తాయని ఆశిద్దాం. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉంటూ ప్రాణాలు కాపాడుకోకతప్పదు. 


Related Post