కేంద్రప్రభుత్వంపై సీరం సంస్థ విమర్శలు

May 22, 2021


img

పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవీషీల్డ్ వ్యాక్సిన్లను భారత్‌లో కోట్లాదిమందికి ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో వాక్సిన్ల కొరతపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ మాట్లాడుతూ, “మొదటి నుంచి కేంద్రప్రభుత్వం సరైన వ్యాక్సిన్‌ విధానం అమలుచేయకపోవడమే ఈ సమస్యకు కారణం. వాక్సిన్లు వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఆ ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా వాక్సినేషన్ చేయాల్సి ఉండగా, కేంద్రప్రభుత్వం మొదట 45 ఏళ్ళు పైబడినవారికి, వారికి పూర్తవకుండానే హడావుడిగా 18 ఏళ్ళకు పైబడినవారికి వాక్సినేషన్‌ మొదలుపెట్టేసింది. మేము వ్యాక్సిన్ల ఉత్పత్తిలో నిర్ధిష్ట లక్ష్యం చేరుకోక మునుపే కేంద్రప్రభుత్వం వ్యాక్సినేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో ఒకేసారి కోట్లాదిమంది వాక్సిన్ల కోసం క్యూ కట్టారు. వారందరికీ సరిపడా వాక్సిన్ నిలువలు సిద్దం చేసుకోకుండానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటని స్పష్టం అయ్యింది,” అని అన్నారు. 

సురేష్ జాదవ్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమని నిలిచిపోతున్న వాక్సినేషన్ ప్రక్రియ నిరూపిస్తోంది. దేశ అవసరాలకు సరిపడినన్ని వాక్సిన్లను ఏర్పాటు చేసుకోవడంలో, సమర్ధమైన వాక్సినేషన్ విధానం రూపొందించుకొని దానీ అంతే సమర్ధంగా అమలుచేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. 

ఇప్పుడు ఒకేసారి అనేక కంపెనీల వాక్సిన్లను దిగుమతి చేసుకోవడం వలన దేశప్రజలకు త్వరగా వాక్సినేషన్ పూర్తవుతుంది కానీ వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల మద్య యుద్ధాలు మొదలవుతాయి. సురేష్ జాదవ్ చేసిన ఈ విమర్శలు ఆ యుద్ధాలకు ఆరంభ సూచిగా కూడా భావించవచ్చు. వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల మద్య జరుగబోయే ఈ యుద్ధాలు ఎక్కడకి దారి తీస్తాయో చూడాలి. 


Related Post