అందరి బతుకులు ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి

May 22, 2021


img

కంటికి కనబడని కరోనా మహమ్మారి అందరి బతుకులు ఆగం చేస్తోంది. జీవితభాగస్వాములను, పిల్లలు తల్లితండ్రులను కోల్పోతున్నారు. కరోనా సోకడంతో కొందరి జీవితాలు ఛిద్రం అవుతుండగా, లాక్‌డౌన్‌తో అన్నీ మూతపడటంతో లక్షలాదిమంది అల్లాడిపోతున్నారు. ఓ పక్క కరోనా...మరోపక్క లాక్‌డౌన్‌లతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.

ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు మూతపడటంతో వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలను పోషించుకొనేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉదయం 10 గంటలకే లాక్‌డౌన్‌ మొదలైపోతుంది కనుక ఆలోగా క్యాబ్స్ ఎక్కేవారుండరు. పైగా కరోనా భయంతో ఎవరూ క్యాబ్స్ ఎక్కేందుకు ఇష్టపడటం లేదు. క్యాబ్‌లకు ప్రధాన ఆదాయం ఐ‌టి కంపెనీల నుంచి వస్తుంటుంది. కానీ అవన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించడంతో క్యాబ్స్ ఎక్కేవారే లేకుండా పోయారు. బుకింగ్స్ లేకపోవడంతో పైసా ఆదాయం లేదు. దాంతో కుటుంబాలు పోషించుకోలేక నానా అవస్థలు పడుతుంటే, మరోపక్క ఆ కార్లకు ఫైనాన్స్ చేసినవారి నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. నెలసరి వాయిదా కట్టకపోతే కార్లు పట్టుకుపోతున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఇక హోటల్స్, సినిమా హాల్స్, బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్, టీవీలు ఫ్రిజ్జులు వంటి గృహోపకరాణాలు అమ్మే పెద్ద పెద్ద షాపులు మొదలు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, ఛాయ్ దుకాణాల వారి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఓ పక్క కరోనా భయాలు...మరోపక్క లాక్‌డౌన్‌ కష్టాలతో అల్లాడిపోతున్నారు. యజమానులకు బిజినెస్ ఉన్నా లేకపోయిన అద్దెలు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాల భారం తప్పడం లేదు. వాటిలో పనిచేసే సిబ్బందికి యజమానులు దయతలిచి ఏమైనా జీతం ఇస్తే దాంతో గడుపుకోవాలి లేకపోతే బ్రతుకు దుర్భరమే. 


ఇక రోజువారీ కూలి పనులు చేసుకొనేవారు, ఇళ్ళలో పనిచేసేవారు పనిలేక...ఆదాయం లేక ఓ పూట తింటూ మరో పూట పస్తులు ఉంటూ దుర్బర జీవితాలు గడుపుతున్నారు.   


కొందరిని కరోనా మహమ్మారి కబళించివేస్తుంటే, మరికొందరు ఈ ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. సమాజంలో ఎటు చూసినా కరోనా మహమ్మారి చేస్తున్న విధ్వంసమే కనిపిస్తోంది. అయితే లక్షలాదిమంది ప్రజలను ఆదుకోవడం ఏ ప్రభుత్వం వల్లా కాదు కనుక ప్రభుత్వాలు కూడా నిసహాయంగా చూస్తుండిపోతున్నాయి. కనుక ఇప్పుడు సమాజంలో ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా తమ శక్తిమేర తమ పరిధిలో ఇటువంటి అభాగ్యులను ఆదుకోవలసిన అవసరం ఉంది. దీనినే దేశభక్తి అనుకోవచ్చు లేదా మానవతావాదం అనుకోవచ్చు. 


Related Post