ప్రజలలో అసహనం...ప్రధాని మోడీ భావోద్వేగం!

May 21, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం యూపీలోని తన బనారస్ నియోజకవర్గంలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ కరోనా మహమ్మారి మన ఆత్మీయులు అనేకమందిని బలితీసుకొంది. వారందరికీ శ్రద్దాంజలి ఘటిస్తున్నాను. ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,” అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యి కాసేపు మాట్లాడలేకపోయారు కానీ నిగ్రహించుకొని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, కార్యకర్తలకు చేతులు జోడించి దణ్ణం పెట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

అయితే గత ఏడాది దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి దానిని కట్టడి చేయడంలో...మందులు, ఆసుపత్రులు, వాక్సిన్లు, చివరికి ఆక్సిజన్‌ సరఫరా విషయంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలకు ప్రజలే భారీ మూల్యం చెల్లిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అందుకు నిదర్శనం.

గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోయినా కనీసం కరోనా పరీక్షలు, చికిత్స, వాక్సిన్ల విషయంలో కేంద్రప్రభుత్వం చురుకుగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. కనుక ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని చనిపోయినవారికి శ్రద్దాంజలి, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేయడం వలన ఏమి ప్రయోజనం?కరోనా కట్టడికి చేయవలసినదంతా చేసి ఉండి ఉంటే భారత్‌లో నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఎవరూ కన్నీళ్ళు పెట్టుకొనే అవసరమూ ఉండేదీ కాదు కదా? ఇప్పటికైనా దేశ ప్రజలు ప్రభుత్వ వైఫల్యాల పట్ల అసహనంతో ఉన్నారనే సంగతి గుర్తించి యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది.      


Related Post