కరోనా, బ్లాక్ ఫంగస్‌ వ్యాధులకు ఏపీలో ఆయుర్వేద మందు?

May 21, 2021


img

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని పీడించి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కరోనా, బ్లాక్ ఫంగస్‌ వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని ఆయుర్వేద వైద్యుల మాటలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు పట్టించుకొన్నారు. 

జిల్లాలోని కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారుచేసి ఇస్తున్న మందులు ఈ రెండు వ్యాధులను సమర్ధంగా నయం చేస్తున్నాయని తెలియడంతో నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది ఆనందయ్య ఆశ్రమానికి క్యూ కడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా ఆ వైద్య ఫలితాల పట్ల సంతృప్తి చెందడంతో శుక్రవారం నుంచి ప్రతీరోజు ఆయుర్వేదమందును పంపిణీ చేస్తామని పేపర్లలో ప్రకటన ఇచ్చారు. దాంతో ఇవాళ్ళ ఉదయమే సుమారు పదివేల మందికి పైగా జనాలు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. దీంతో కృష్ణపట్నం వెళ్ళే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. అతికష్టం మీద పోలీసులు వారిని అదుపుచేసి చాలామందిని వెనక్కు తిప్పి పంపించారు. అయితే ఇప్పటికే ఆనందయ్య ఆశ్రమం వద్ద వేలాదిమంది ఆయుర్వేద మందుకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 

ఈ ఆయుర్వేద మందు గురించి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చెవిన కూడా పడటంతో ఆయన దానిపై శాస్త్రీయ అధ్యయనం చేయడానికి ఐసీఎంఆర్ వైద్య బృందాన్ని అక్కడకి పంపిస్తున్నారు. ఒకవేళ ఆనందయ్య తయారుచేస్తున్న ఆ మందులు కరోనా, బ్లాక్ ఫంగస్‌ వ్యాధులను సమర్ధంగా తగ్గిస్తున్నట్లు వారు ధృవీకరిస్తే, ఏపీ ప్రభుత్వం ఆ మందులను పెద్ద ఎత్తున తయారుచేయించి ప్రజలకు పంపిణీ చేసే అవకాశం ఉంది.

గమనిక: ఆయుష్-64 అనే ఆయుర్వేద గుళికలు కరోనా, బ్లాక్ ఫంగస్ తో సహా వివిద రకాల వైరస్ లను సమర్ధంగా అడ్డుకొంటాయని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సారంగపాణి ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు.  


Related Post