కేసీఆర్‌ ఆసుపత్రుల పర్యటనలపై బిజెపికి అభ్యంతరాలు... దేనికి?

May 21, 2021


img

కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను గడగడలాడిస్తుంటే సిఎం కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌసులో లేదా ప్రగతి భవన్‌లో కాలక్షేపం చేస్తున్నారంటూ ఇదివరకు ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తుండేవి. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ గాంధీ, ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళి నేరుగా కరోనా రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెపుతుంటే కూడా ప్రతిపక్షాలు... ముఖ్యంగా బిజెపి ఆయనను విమర్శిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. అంటే ఆసుపత్రుల పర్యటనకు వెళ్ళినా వెళ్లకపోయినా వారికి అభ్యంతరాలు ఉంటాయన్న మాట! 

గాంధీ ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేవని, రోగులకు సరైన సదుపాయాలు లేవని సిఎం కేసీఆర్‌ వాటిని పట్టించుకోకుండా ప్రచారం కోసమే పర్యటనలు చేస్తున్నారంటూ బండి సంజయ్‌ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. సిఎం కేసీఆర్‌ ఆసుపత్రులకు వెళ్ళిందే...మానసిక, శారీరక క్షోభ అనుభవిస్తున్న కరోనా రోగులకు, వారి సహాయకులకు ధైర్యం చెప్పడానికి. ప్రజల మద్యకు వచ్చి వారికి ధైర్యం చెప్పాలనే కదా ఇదివరకు ప్రతిపక్షాలు కోరుకొన్నాయి. మరి ఇప్పుడెందుకు విమర్శిస్తున్నాయి? 

సిఎం కేసీఆర్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆసుపత్రి అంతటా కలియతిరిగి స్వయంగా అక్కడి పరిస్థితులను చూసి, ఆ తరువాత వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రికి కావలసిన సదుపాయాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి తెలుసుకొన్నారు. అంటే సమస్యల పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతోంది. అయినా సిఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఎందుకు? 

సిఎం కేసీఆర్‌ ప్రచారం కోసమే ఆసుపత్రులకు వెళుతున్నారని వాదిస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్నదేమిటి?ఈ పర్యటనలతో ఆయనకు ప్రజలలో ఇంకా మంచి పేరు వచ్చేస్తుందనే భయంతోనే కదా ఇటువంటి కువిమర్శలు చేస్తున్నది?

పార్టీల మద్య రాజకీయ శతృత్వం ఉంటే దానిని పార్టీల వరకే పరిమితం చేసుకోవాలి కానీ సిఎం కేసీఆర్‌ మంచి పని చేసినా విమర్శించడాన్ని ప్రజలు హర్షించబోరని గ్రహిస్తే మంచిది.


Related Post