మరో మిగ్ నేల కూలింది...పైలట్ మృతి

May 21, 2021


img

భారత వాయుసేనకు చెందిన మిగ్-బైసన్ యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్, స్క్వార్డన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందారు. భారత వాయుసేన తెలిపిన సమాచారం ప్రకారం గురువారం రాత్రి సుమారు ఒంటి గంటకు పంజాబ్ రాష్ట్రంలోలాంగియాన ఖుర్ధ్ అనే గ్రామంలో కూలిపోయింది. విమాన ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. ఈ ఘటనపై భారత వాయుసేన దర్యాప్తు మొదలుపెట్టింది. 

ఈ 5 నెలల్లో ఇది మూడో ప్రమాదం. జనవరిలో రాజస్థాన్‌లో మిగ్-21 యుద్ధవిమానం కూలిపోయింది. కానీ దానిలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ మార్చిలో మిగ్ బైసన్ విమానం కూలిపోగా దాని పైలట్ గుప్తా చనిపోయారు. 

మిగ్ యుద్ధవిమానాలు భారత్‌కు దశాబ్ధాలుగా సేవలందిస్తున్నప్పటికీ అవి పైలట్ల పాలిత ఎగిరే మృత్యుపేటికలుగా మారుతున్నాయి. యుద్ధవిమానం కూలిపోవడం వలన కలిగే ఆర్ధికనష్టంతో పాటు ఎన్నో ఏళ్లపాటు కఠోర శిక్షణ పొందిన పైలట్ చనిపోతే అదీ వాయుసేనకు తీరని నష్టమే. ఈ ప్రమాదాలలో చనిపోయిన పైలట్ల కుటుంబాలకు జీవితాంతం తీరని శోకం తప్పదు.       

 ఏడాదికి రెండు మూడు మిగ్ విమానాలు కూలిపోతుంటే ఆవిదంగా ఎందుకు జరుగుతోంది? పైలట్ల తప్పిదం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా సాంకేతిక లోపం వలన జరుగుతున్నాయా అనే విషయం దర్యాప్తులో కొంతవరకు తెలుస్తుంది. కనుక ఎప్పటికప్పుడు గుర్తించిన ఆ లోపాలను సవరించుకొంటే ఇటువంటి విషాదకరమైన ప్రమాదాలు పునరావృతం కావు. కానీ అవుతున్నాయి... అంటే అర్ధం ఏమిటి?


Related Post