ప్రజలకు రెమ్‌డెసివర్‌ కష్టాల నుంచి విముక్తి

May 20, 2021


img

కరోనా చికిత్సలో చాలా ప్రధానమైన ఔషదంగా భావిస్తున్న రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల వలన కరోనా రోగులు కొలుకొంటున్నట్లు ఖచ్చితమైన ఆధారాలేవీ లేవని కనుక దానిని కరోనా చికిత్స నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కరోనా చికిత్సలో రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను వాడనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

కేంద్రప్రభుత్వం కూడా ఈ ఇంజక్షన్‌పై అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కనుక త్వరలోనే రెమ్‌డెసివర్‌ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రజలకు రెమ్‌డెసివర్‌ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. 

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ మొదలైన తరువాత కరోనా చికిత్సలో రెమ్‌డెసివర్‌ చాలా కీలకంగా భావించడంతో బ్లాక్ మార్కెటర్లు రెచ్చిపోయి ఒక్కో డోస్‌ ఇంజెక్షన్ రూ.25-45,000 వరకు అమ్ముకొని ప్రజలను నిలువు దోపిడీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇదే అదునుగా రెమ్‌డెసివర్‌ పేరు చెప్పి రోగుల కుటుంబాల నుంచి లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసుకొంటున్నాయి. ఒకవేళ కేంద్రప్రభుత్వం రెమ్‌డెసివర్‌ని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లయితే, ఇక దానిని కొనేవాళ్ళే ఉండరు. కనుక దాని ధర మళ్ళీ దిగివస్తుంది. అవసరమైతే అప్పుడు సామాన్య ప్రజలు కూడా కొనుగోలుచేయగలుగుతారు.  

అయితే ఇంతకాలం రెమ్‌డెసివర్‌ దివ్యౌషదంగా అభివర్ణించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కరోనా రోగులకు దానిని వినియోగిస్తూ ఇప్పుడు హటాత్తుగా అది ఓ పనికిరాని ఔషదం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఇంతకాలం రెమ్‌డెసివర్‌ పనితీరు, ఫలితాల గురించి ఏమీ తెలుసుకోకుండానే చికిత్సకు సిఫార్సు చేసిందా? వైద్యులు కూడా అది పని చేస్తోందా లేదా అని నిర్ధారించుకోకుండానే చికిత్సలో వినియోగిస్తున్నారా?అయితే ఇంతకాలం ప్రజలు దాని కోసం ధారపోసిన లక్షల రూపాయలు అన్ని బూడిదలో పోసినట్లేనా? అనే ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బదులిస్తే బాగుంటుంది.


Related Post