సిఎం కేసీఆర్‌ సాహసం చేశారా?

May 19, 2021


img

సిఎం కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఆయనతో పాటు మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ తదితరులు కూడా వెళ్ళారు. సిఎం కేసీఆర్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల వద్దకు వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పారు. అంతకు ముందు ఆయన ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందితో మాట్లాడి వారి సేవలను ప్రశంశించారు. ఆ తరువాత ఆసుపత్రి అంతా కలియతిరిగి స్వయంగా అన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ముగ్గురూ గాంధీ ఆసుపత్రికి వెళ్ళి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి రోగులకు ధైర్యం చెప్పడం చాలా అభినందనీయమే. అయితే కరోనా బారినపడి కోలుకొన్నవారు ముగ్గురూ కేవలం మాస్కులు మాత్రమే ధరించి నేరుగా కరోనా వార్డులలో తిరగడం, కరోనా రోగులకు అతి సమీపంలో నిలబడి మాట్లాడటం చాలా ప్రమాదకరమని చెప్పక తప్పదు. 

గత ఏడాది దేశంలో కరోనా ప్రవేశించినప్పుడు వైద్యులు, సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి గాని రోగుల వద్దకు వెళ్ళేవారు కారు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి ఇంకా శక్తివంతంగా మారినప్పుడు కనీసం చేతికి గ్లౌజులు కూడా వేసుకోకుండా కేవలం మాస్కులు పెట్టుకొని సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు, సోమేష్ కుమార్‌ కరోనా రోగులకు అంత దగ్గరగా వెళ్ళి మాట్లాడటం చాలా సాహసమనే చెప్పక తప్పదు.


Related Post