లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుతుందా...ఆగుతుందా?

May 17, 2021


img

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ చివరి అస్త్రం అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో పాక్షిక కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌, వారాంతపు కర్ఫ్యూ, రాత్రిపూట కర్ఫ్యూలు అమలులో ఉండేవి. ఆ తరువాత దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అనే చివరి అస్త్రాన్నే నమ్ముకొన్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అప్పుడే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భుజాలు చరుచుకొంటున్నాయి. 

అయితే కరోనా పరీక్షలు చేయకుండా, రోగులకు చికిత్స అందించకుండా, ప్రజలందరికీ టీకాలు వేయకుండా కేవలం లాక్‌డౌన్‌ విధించి చేతులు దులుపుకొంటే కరోనా తగ్గిపోదు....ఆగుతుంది అంతే! ఎందుకంటే, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకురారు కనుక కరోనా వ్యాప్తి ఆగుతుంది. మళ్ళీ అందరూ బయటకు వస్తే వారితో పాటు ఇళ్ళలో దాక్కొన్న కరోనా మహమ్మారి కూడా బయటకు వస్తుంటుంది. కనుక దేశంలో... ప్రపంచంలో ఎక్కడ కరోనా మహమ్మారి దాగి ఉన్నా అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందని స్పష్టమవుతోంది. దీనికి ఏకైక పరిష్కారం టీకాలు వేసుకోవడమే అని అమెరికా నిరూపించి చూపుతోంది.  

అయితే భారత్‌లో టీకాలు, మందులు, ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది తగినంత అందుబాటులో లేనందున అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌నే నమ్ముకొన్నట్లు చెప్పవచ్చు. కానీ లాక్‌డౌన్‌ అనే బ్రహ్మాస్త్రాన్ని కరోనా మహమ్మారిపై కాక పిచ్చుకల వంటి సామాన్య, నిరుపేద, మద్యతరగతి ప్రజలపై ప్రయోగించినట్లవుతోందని చెప్పక తప్పదు. లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కనుక లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేశామని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భుజాలు చరుచుకొనే బదులు దేశ ప్రజలందరికీ వీలైనంత త్వరగా కరోనా టీకాలు వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తే మంచిది.


Related Post