టిఆర్ఎస్‌ ఉచ్చులో ఈటల పడతారా?

May 17, 2021


img

ఈటల రాజేందర్‌ను టిఆర్ఎస్‌ అధిష్టానం మంత్రివర్గం నుంచి బయటకు పంపించగలిగింది కానీ ఆయన పార్టీ వ్యతిరేక కార్యమాలకు పాల్పడుతున్నా ఇంతవరకు పార్టీ నుంచి బహిష్కరించలేదు. అందుకు బలమైన కారణమే ఉంది. ఆయన వేరే పార్టీలో చేరినట్లయితే అప్పుడు ఆయనపై అనర్హత వేటువేసి పార్టీ నుంచి బహిష్కరించడం సులువు. ఇప్పుడే బహిష్కరిస్తే ఆయనతో పార్టీకి సంబందం ఉండదు కనుక అనర్హత వేటు వేయలేదు. ఈవిషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఏ పార్టీలోనూ చేరడం లేదు...తన ఎమ్మెల్యే పదవిని వదులుకొంటానని చెప్పడం లేదు. 

కనుక ఆయనపై ఒత్తిడి పెంచేందుకు టిఆర్ఎస్‌ అధిష్టానం మరోదారి ఎంచుకొన్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో ఆయన ముఖ్య అనుచరులను ఆయన నుంచి వేరు చేసి టిఆర్ఎస్‌వైపుకు వచ్చేలా మంత్రి గంగుల కమలాకర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు దూరమైన వారిచేతే హుజూరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి ‘దమ్ముంటే రాజీనామా చేసి ఉపఎన్నికలలో గెలిచి చూపించమంటూ...’ సవాళ్ళు చేయిస్తున్నారు. 

వారి సవాళ్ళు దేనికో ఈటల రాజేందర్‌కు బాగా తెలుసు అందుకే ఆయన వాటిని స్వీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ‘కరోనా కష్టకాలంలో ఈ ఎన్నికల యావ ఏమిటని...’ టిఆర్ఎస్‌ నేతలను నిలదీస్తున్నారు. కనుక ఈటల రాజేందర్‌ చేత రాజీనామా చేయించడం టిఆర్ఎస్‌కు పెద్ద సవాలుగా మారిందనే చెప్పవచ్చు. 

కానీ ఒకసారి టిఆర్ఎస్‌ అధిష్టానం ఎవరి వెంటైనా పడితే అది ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టదని ఈటల రాజేందర్‌ స్వయంగా చెప్పారు. కనుక ఆయన ఇంకా ఎంతో కాలం ఒంటరి పోరాటం చేయలేరనే చెప్పవచ్చు. చివరికి ఆయన కాంగ్రెస్‌ లేదా బిజెపిలలో దేనినో ఓ దానిని ఎంచుకొని చేరక తప్పదు. ఏదో ఓ రోజున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకా తప్పదు. అంతవరకు ఈటల-గంగుల మద్య ఈ యుద్ధం కొనసాగుతూనే ఉండవచ్చు.


Related Post