సెకండ్ డోస్‌కు మళ్ళీ మార్గదర్శకాలు

May 17, 2021


img

దేశంలో లక్షలాదిమంది రెండో డోస్‌ కోసం టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారితోపాటు మొదటి డోస్‌ కోసం లక్షల మంది తిరుగుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం మొదటి డోస్‌కు...రెండో డోస్‌కు మద్య వ్యవధిని 12-16 వారాలకు పెంచింది. దీంతో మళ్ళీ గందరగోళం ఏర్పడింది. 

ఇంకా మొదటి డోస్‌ వేసుకోవలసినవారికి టీకాలు వేసేందుకే వ్యవధి పెంచిందని భావించి టీకా కేంద్రాల చుట్టూ తిరిగేవారు కొందరైతే, ఇక నుంచి తమకు రెండో డోస్‌ టీకాలు వేస్తారని తిరిగేవారు మరికొందరు. కొత్త మార్గదర్శకాల గురించి తెలియని అనేకమంది కూడా మొదటి, రెండో డోస్‌ల కోసం వస్తుండటంతో వారిని సిబ్బంది వెనక్కు తిప్పి పంపుతున్నారు. 

ఈ సమస్యను గుర్తించిన కేంద్రం మళ్ళీ ఆదివారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రెండో డోస్‌ టీకాల కోసం ఇప్పటికే కోవిన్ మొబైల్ యాప్‌లో స్లాట్ బుక్‌ చేసుకొన్నవారికి అపాయింట్‌మెంట్‌ రద్దు చేయలేదని, వారికి 12-16 వారాలు పూర్తికాకపోయినా టీకాలు వేయాలని, మిగిలినవారికి మాత్రం 12 వారాల తరువాతే టీకాలు వేయాలని నిర్దేశించింది. ఈ మేరకు కోవిన్ యాప్‌లో మార్పులు చేసినట్లు కేంద్రం తెలిపింది. 

దేశవ్యాప్తంగా 135 కోట్లకు పైగా జనాభాకు టీకాలు వేయాల్సి ఉంది. వారిలో నిరుపేదలు, సంపన్నులు, నిరక్షరాస్యులు, విద్యాధికులు, మైనర్లు, మేజర్లు, నగరాలు పట్టణాలలో నివసించేవారు...మారుమూల ప్రాంతాలలో నివసించేవారు ఇలా....అనేక వర్గాలవారున్నారు. దీనికి తోడు దేశ జనాభాకు సరిపడినంత వాక్సిన్ ఉత్పత్తి జరుగడం లేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా వాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం వలననే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. 

దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం చేతిలో  వేలాదిమంది ఉన్నతాధికారులు, నిపుణులు ఉన్నప్పటికీ ఇంతవరకు సరైన వాక్సినేషన్ విధానం రూపొందించుకోలేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండటం చాలా శోచనీయం.


Related Post