మాస్కుల నుంచి అమెరికాకు విముక్తి.. భారత్‌కి ఎప్పుడో?

May 15, 2021


img

అమెరికాలో కరోనా వాక్సినేషన్‌ శరవేగంగా సాగుతుండటంతో దేశ జనాభాలో 53 శాతానికి పైగా రెండు డోసులు వేయడం పూర్తయింది. దీంతో అమెరికాలో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కనుక అమెరికాలో రెండు డోసులు వేసుకొన్నవారు ఇకపై బహిరంగ ప్రదేశాలలో తిరిగినప్పుడు మాస్కూలు ధరించనవసరంలేదని, భౌతిక దూరం కూడా పాటించనవసరం లేదని అమెరికా ప్రజారోగ్య శాఖకు చెందిన సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాచెల్ వాలెంస్కీ గురువారం ప్రకటించారు.అయితే రెండు డోసులు వాక్సిన్లు వేసుకొన్నవారు, బస్సులు, రైళ్లు, విమానాలలో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పారు.  ఒక డోస్ వేసుకొన్నవారు, ఇంతవరకు అసలు ఒక్క డోస్ వాక్సిన్ కూడా వేసుకోనివారు, కరోనా లక్షణాలున్నవారు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.    

అయితే భారత్‌లో కరోనా ఉదృతి చాలా ఎక్కువగా ఉండటం, రకరకాల కరోనా వేరియంట్లు వ్యాపించి ఉండటం వలన భారత్‌లో రెండు డోసులు వాక్సిన్లు వేసుకొన్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. మాస్కూలు, భౌతికదూరం మాత్రమే ప్రజలను కరోనా బారినుండి కాపాడుతాయని అన్నారు. అమెరికాలో పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు కనుక భారత్‌లో ఇప్పుడే మాస్కులు పక్కనపెట్టడం చాలా ప్రమాదకరమని అన్నారు. కనుక ప్రజలందరూ తప్పనిసరిగా మరికొంత కాలం మాస్కులు, భౌతిక దూరం వంటి అన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని అన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో భారత్‌లో వివిద కంపెనీలకు చెందిన వాక్సిన్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి వస్తే బహుశః ఈ ఏడాది డిసెంబర్‌ దేశంలో 50-60 శాతం జనాభా వాక్సిన్లు వేసుకొనే అవకాశాలున్నాయి. కనుక 2022 మార్చి నాటికి భారత్ కూడా కరోనా, మాస్కుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.


Related Post