టిఆర్ఎస్‌ను చీల్చే శక్తి ఎవరికీ లేదు: మంత్రి గంగుల

May 14, 2021


img

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌లో నిన్న టిఆర్ఎస్‌ కౌన్సిలర్లతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ పార్టీని చీల్చే శక్తి ఎవరికీ లేదు. టిఆర్ఎస్‌లో నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీవ్యక్తికీ సరైన గుర్తింపు, సముచిత స్థానం తప్పక లభిస్తుంది. కనుక ఈటల వంటి కొందరు నేతల మాటలు నమ్మి తప్పు దోవలో వెళ్లవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ హుజూరాబాద్‌లో పర్యటించనున్నారు,” అని అన్నారు.   

ఈటల రాజేందర్‌ను ప్రభుత్వంలో నుంచి బయటకు పంపించిన తరువాత ఆయన టిఆర్ఎస్‌లో అసంతృప్త నేతలను, కార్యకర్తలను తనవైపు తిప్పుకొనేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారినందరినీ కలుస్తూ పెద్ద యుద్ధానికి సిద్దమవుతున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలిసి కొట్లాడిన ఈటల రాజేందర్‌పై భూకబ్జాల ముద్రవేసి ప్రభుత్వం నుండి సాగనంపడంతో ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. ఇవన్నీ సిఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలియవనుకోలేము.  

గతంలో ఓసారి ఈటల గులాబీ జెండా యజమానులని అన్నప్పుడు తప్ప మరెన్నడూ పార్టీలో చీలిక ప్రస్తావన రాలేదు. కానీ తొలిసారిగా ఇప్పుడు మంత్రి గంగుల నోట ఆ మాట వినిపించడం గమనిస్తే ఈటల విషయంలో టిఆర్ఎస్‌ అధిష్టానం ఆందోళనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఈటలకు టిఆర్ఎస్‌ను చీల్చే అంత శక్తి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. ఒకవేళ శాసనసభ ఎన్నికలు దగ్గర పడి ఉంటే టిఆర్ఎస్‌లో అసంతృప్త నేతలు ఈటల శిబిరంలో చేరేవారేమో కానీ ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉండగా ఇప్పుడు ఎవరూ అటువంటి ఆలోచన చేయరనే చెప్పవచ్చు. 


Related Post