మండలి ఎన్నికలు వాయిదా..అందుకేనా?

May 14, 2021


img

ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో త్వరలో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీలకు ఈ నెల 31న, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీలకు జూన్‌ 3న పదవీకాలం పూర్తవుతుంది. కనుక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌16 నిబంధనల ప్రకారం ఆలోపుగానే ఆ స్థానాలను భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ కరోనా కారణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించలేమని, పరిస్థితులు చక్కబడిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.

రాష్ట్రంలో 2015లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, మహమ్మద్ ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఎన్నికయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గవర్నర్‌ కోటాలో ఎన్నికయ్యారు. ఈ స్థానాలకు సిఎం కేసీఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తే వారే పోటీ లేకుండా ఎన్నికవుతారు కనుక సిట్టింగ్ ఎమ్మెల్సీలతో పాటు పార్టీలో చాలా మంది ఈ ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసీ వారి ఆశలపై నీళ్ళు చల్లింది. 

దేశంలో కరోనా తీవ్రతను... దాని వలన జరుగుతున్నా నష్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇటీవల పుదుచ్చేరీతో సహా నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టులు, సుప్రీంకోర్టులు, జాతీయ, అంతర్జాతీయ మీడియా తీవ్రంగా ఆక్షేపించాయి. ఈసీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలననే దేశంలో కరోనా తీవ్రత మరింత పెరిగిపోయిందని విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. బహుశః అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసి ఉండవచ్చు.


Related Post