అందుకే అమెరికాను అగ్రరాజ్యం అంటారేమో!

May 13, 2021


img

గత ఏడాది ప్రపంచదేశాలలోకెల్లా కరోనాతో ఎక్కువ నష్టపోయిన దేశం అమెరికా. కానీ ఏడాది వ్యవదిలోనే అమెరికా కరోనాను జయించడమే కాకుండా ప్రపంచదేశాలకు అండగా నిలబడుతోంది కూడా! అప్పుడూ...ఇప్పుడూ అదే ప్రభుత్వం...అదే అధికారులు...అదే ఉద్యోగులు కానీ ఇదెలా సాధ్యం? అనే సందేహం కలుగవచ్చు. ప్రభుత్వం... పాలకులు... యంత్రాంగం అంతా సమర్ధంగా... చిత్తశుద్దితో పనిచేయడం వలననే ఇది సాధ్యం అయ్యిందని చెప్పవచ్చు.  ఆనాడు డోనాల్డ్ ట్రంప్‌ మొదట్లో కరోనాను చాలా తక్కువగా అంచనా వేసినప్పటికీ, దేశ ప్రజలకు అవసరమైన దానికంటే రెట్టింపు వాక్సిన్లు కొనుగోలు చేసి సిద్దంగా ఉంచారు. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌, దేశంలో చాలా చురుకుగా వాక్సినేషన్ ప్రక్రియను చేయిస్తూనే కరోనా నివారణకు మరింత సమర్ధమైన చర్యలు చేపట్టారు. దేశంలో వాక్సిన్లు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో అమెరికా ప్రభుత్వం మైనర్లకు కూడా వాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. 

దీంతో అమెరికాలో కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికాలో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. అమెరికాలో గత ఏడాది రోజుకు 2-3 లక్షల పాజిటివ్ కేసులు, వేల మరణాలు నమోదవుతుండేవి కానీ ఇప్పుడు రోజుకు కేవలం 38,000 కేసులు, 600 కంటే తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో ఒక్క కరోనా మరణం కూడా లేదిప్పుడు. దీనిని బట్టి అమెరికా ప్రభుత్వం... యంత్రాంగం ఎంత సమర్ధంగా కరోనాను కట్టాడి చేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. 

అంతేకాదు...కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఈ వాక్సిన్లు ఏవీ సరిపోవని గుర్తించిన అమెరికా, మరింత శక్తివంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. జంతువులపై ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో త్వరలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దం అవుతోంది. 

దేశ అవసరాలకు సరిపడా  వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఆక్సిజన్‌, మందులు వగైరా ఉత్పత్తి, సరఫరా చేసుకోవడమే కాకుండా భారత్‌తో సహా ఇతర దేశాలకు కూడా వాటిని అందిస్తోందిప్పుడు. 

అమెరికా ప్రభుత్వం, దాని యంత్రాంగం కార్యదక్షతకు, ప్రజాసంక్షేమం పట్ల వాటి నిబద్దతకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? కానీ భారత్‌లో లోపించింది అదే! అందుకే కరోనాకు దేశ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.


Related Post