అందుకే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయలేకపోతున్నాం: బిజెపి

May 12, 2021


img

దేశంలో 135 కోట్లకు పైగా జనాభా...వారిలో రోజూ లక్షలాదిమంది కరోనా మహమ్మారిబారిన పడుతుంటే, మరో పక్క వ్యాక్సిన్‌ కొరత వేదిస్తుంటే, కేంద్రప్రభుత్వం రోమ్ నగరం తగులబడిపోతుంటే ఫిడేలు వాయించుకొంటూ కూర్చోన్న నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎట్టకేలకు వాటి విమర్శలకు బిజెపి అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర నేడు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు.  

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో వాక్సిన్ల కొరత ఉన్న మాట వాస్తవం. దానిని అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా ఐక్యరాజ్య సమితితో మాట్లాడి కరోనా వాక్సిన్లపై పేటెంట్ హక్కులు రద్దు చేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే ప్రపంచంలో తయారైన ఏ కరోనా వాక్సిన్నయినా భారత్‌లో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్న కొవీషీల్డ్ లైసెన్స్ అమెరికా సంస్థ ఆస్ట్రాజెనికా చేతిలో ఉంది. కనుక దాని అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాము. భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్‌లో సజీవ వైరస్ ఉంటుంది. కనుక దానిని ఉత్పత్తి చేయగల కంపెనీలు దేశంలో నాలుగు మాత్రమే ఉన్నాయి. వాటిలో కోవాక్సిన్ ఉత్పత్తికి ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటిలో ఉత్పత్తి ప్రారంభమైతే దేశంలో వాక్సిన్ల కొరత గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నాము,” అని చెప్పారు.


Related Post